ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ప్రాంగణంలో పల్లవిస్తున్న ప్రజా కళల గొంతుక బాబ్జీ. కళ కళ కోసం కాదు… కళ ప్రజల కోసం అనే సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని మానవజాతి ముంగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలి వేదిక నుంచి వెండితెర వైపు నడిసొచ్చిన రచయిత, దర్శకుడు ఆయన. చదువుకునే రోజులలో విప్లవ విద్యార్థి నాయకుడిగా అవిభక్త తెలుగు రాష్ట్రంలో ఉధృతంగా ఉద్యమించి, పోలీస్ లాఠీలకు తన శరీరాన్ని పలుమార్లు అప్పగించిన ఉద్యమ నేపథ్యం ఆయనది…!
ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఆ రోజులలో జరిగిన వివిధ ప్రజా సంఘాల పోరాట వేదికలపై నటించిన, నటించిన, గళమెత్తి గర్జించిన ప్రజా కళాకారుడాయన.ఒక అభ్యుదయ రచయితగా ఆయన కలం నుంచి జాలువారిన అనేక పాటలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా గాయకుల గొంతులలో ఈనాటికి పల్లవిస్తూనే ఉన్నాయి. గతంలో నల్ల పూసలు, ఎన్.టి.ఆర్.నగర్, రఘుపతి వెంకయ్యనాయుడు వంటి చరిత్ర గుర్తుంచుకునే చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబ్జీ ప్రస్తుతం ‘పోలీస్ వారి హెచ్చరిక’ అను కమర్షియల్ అంశాలు మేళవించిన ఆలోచనాత్మక చిత్రంతో ప్రేక్షకలోకం ముందుకు వస్తున్నాడు. ఈనెల 18వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆయనతో జరిపిన పెన్ కౌంటర్ ఇది..
ఉద్యమకారులకు పోలీసులంటే పడడంటారు కదా..మీరేంటి ‘పోలీస్ వారి హెచ్చరిక’ అంటూ పోలీసులకు సపోర్ట్ చేసే టైటిల్‌తో సినిమా చేస్తున్నారు?
– పోలీసులంటే పడదని ఎప్పుడు అన్నాను.. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్లను కంట్రోల్ చేయడం వాళ్ళ డ్యూటీ. అలా వాళ్ళు ప్రభుత్వం పక్షాన ఉంటారు. ఉద్యమ కారులు ప్రజల పక్షాన ఉంటారు…. ఈ క్రమంలో ఒకరంటే మరొకరికి వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. అయినా…. నేనిప్పుడు సినిమానే ప్రాణంగా జీవిస్తున్న కళాకారుడిని…సినిమా కళాకారుడిని.
మీరు సినిమా ద్వారా చేసే ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఏమిటో చెప్తారా…?
-అది సస్పెన్స్…. ముందే చెప్పేస్తే సినిమా చూస్తున్నప్పుడు కిక్ ఉండదు..! ఆ హెచ్చరిక ఏమిటో సినిమా థియేటర్‌లో వెండితెర ఆవిష్కరిస్తుంది….!ఇది అందరికీ తెలిసిన టైటిల్…అనేక సందర్భాలలో, అనేక ప్రదేశాలలో, ఆయా పరిస్థితులను బట్టి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు… గోడలపై రాస్తుంటారు … మైకులలో అనౌన్స్ చేస్తుంటారు… ఆ విధంగా అది అందరి నోళ్లలో నానుతున్న టైటిల్. ఇలా ఎంతో పాపులర్ అయిన టైటిల్‌ను ముందే అనుకోని కథ రాసుకున్నారా..? కథ రాసుకున్నాక టైటిల్ అనుకున్నారా….?
– కథ రాసుకున్నప్పుడు.. అది స్క్రీన్‌ప్లే దశకు చేరుకున్నప్పుడు, ఆ టైటిల్ నా కలం నుంచి పురుడుపోసుకుంది. అది మా సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యింది. పోలీస్ లాఠీ అంత బలంగా మారింది.
ఇది ఎర్ర సినిమానా….??
– కాదు…కానీ అండర్ కరెంట్‌గా కథా గమనంలో అక్కడక్కడ ఎర్ర గాలులు వీస్తుంటాయి. ఇది పక్కా కమర్షియల్ సినిమా.
రెగ్యులర్ హీరోల సినిమా ఛాయలు కనిపిస్తాయా….?
– నో….అస్సలు కనబడవు. ఇది విలన్‌ల ప్రేమ కథ. ఇందులో విలన్‌లు ప్రేమించుకుంటారు…ప్రేమ గీతాలు పాడుకుంటారు….ఫైట్‌లు చేస్తుంటారు…. హత్యలు చేస్తుంటారు…. రక్తంతో స్నానాలు చేస్తుంటారు… హీరో మాత్రం పిచ్చోడై తిరుగుతుంటాడు.. అతడు పోలీస్ స్టేషన్‌ను , పోలీస్ యూనిఫాంను , పోలీస్ టోపీని , పోలీస్ లాఠీని ప్రేమిస్తుంటాడు…ప్రజలకు కాపలా కాసే పోలీస్‌స్టేషన్‌కు కాపలా కాస్తుంటాడు.
మీరు ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్ , ట్రైలర్‌లలో మహా కవి శ్రీ శ్రీ గారు తొంగి చూస్తున్నారు…. ఎందుకు..?
– శ్రీశ్రీ గారంటే నాకు పిచ్చి…. ఆయన కవితలంటే మహా పిచ్చి… నేను రాసిన నాటికలు నాటకాలలో, నా పాటలలో, నా సినిమా రచనల్లో , నా ఉపన్యాసాలలో శ్రీశ్రీ గారు చెప్పాపెట్టకుండానే ఎంటర్ అయిపోతుంటారు.
సినిమాకు మీరిచ్చే నిర్వచనం….?
– సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ…సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రరేఖ…. దర్శకుడికి ప్రతి సినిమా ఒక యుద్ధమే అంటారు…. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చేస్తున్న ‘‘పోలీస్ వారి హెచ్చరిక’’ అనే యుద్ధం ముగిసే దశకు చేరుకుంది కదా…. ఈ నెల 18న విడుదల అవుతుంది కదా…. సినిమా తీయడం కంటే ఆ సినిమా ను థియేటర్‌లలో విడుదల చేయడం నిజమైన యుద్ధం. ఆ యుద్ధం కూడా ముగిసే దశకు చేరుకున్నారు.. ఈ సందర్భంగా మీకు, మీ టీం కు మా శుభాకాంక్షలు. మరి తదుపరి యుద్ధం సంగతేమిటి..?
– సినిమా వాళ్ళు జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉండాలి…. అలా నేను కూడా తదుపరి యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటూనే ఉన్నాను. ఇది నాకు ఇష్టమైన యుద్ధం. నేను ప్రేమించే యుద్ధం. అనుకున్న గమ్యాన్ని చేరేవరకు ఈ యుద్ధాన్ని ప్రేమగా చేస్తూనే ఉంటాను. రెప్పల మాటున రేపటి స్వప్నం సినిమా….. కలల కాన్పుల నిండు చూలాలు సినిమా…వెండి తెరపైన పొద్దు పొడుపు మన సినిమా…. గుండె పొరలల్లో నీటి చెమ్మ మన సినిమా….!!!
అంటూ తన ఇంటర్వ్యూను ఎంతో భావావేశంతో ముగించారు అభ్యుదయ దర్శకుడు బాబ్జీ.



