ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో ప్రతిభ గల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలు కూడా సినిమా పై అంచనాలని పెంచాయి. మే 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్నీ మంచి శకునములే చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం కథకు సోల్ లాంటిదని దర్శకురాలు నందిని రెడ్డి అన్నారు. అన్నీ మంచి శకునములే చిత్రం గురించి, ఇతర విషయాల గురించి దర్శకురాలు నందిని రెడ్డి ఇంటర్వ్యూ లో పలు విషయాలు తెలియజేసారు.
ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా సినిమా కనుక లైన్ పెద్దగా వుండదు. అన్నీ మంచి శకునములే చిత్రాన్ని ఎలా కొత్త కోణంలో చూపించబోతున్నారు? మీకు ఛాలెంజ్ అనిపించిందా?
ఇది కొత్త పాయింట్ నో డౌట్ అందులో. రాయడానికి మంచి స్కోప్ వుంది. సంతోష్, మాళవిక తో పాటు మిగిలిన పాత్రలకూ ప్రాధాన్యత వున్న కథ ఇది. సహజంగా హీరో హీరోయిన్లకు ఫాదర్, మదర్ వుంటారు. బొమ్మరిల్లులో ప్రకాష్‌రాజ్ పాత్ర.. అన్నింటికీ ఇన్‌వాల్వ్ అవుతూ వుంటుంది. అలాగే అన్ని మంచి శకునములే కి వచ్చేసరికి పాత్రలన్నీ తీసుకునే నిర్ణయాలకు కనెక్షన్ వుంటుంది. విక్టోరియా పురం అనే ఊరి కథ. ఆ ఊరికి ఈ పాత్రలకు సంబంధం ఏమిటి? లవ్ స్టోరీకి ఏమిటి సంబంధం? ఇలా అన్ని లింక్ తోనూ వుంటాయి. అసలు ఇలాంటి కథకు చాలా పాత్రలు ఉండడం వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్.
హమ్ ఆప్‌కే హై కౌన్ సినిమాలో ప్రతి పాత్రా మనకు గుర్తిండిపోతుంది. ఆడియన్ కూడా కనెక్ట్ అవుతాడు. అంత కాకపోయినా ఈ కథకు రైటింగ్ విషయంలో ప్రతి వారికి స్పేస్ ఇవ్వాలనేది చూసుకున్నాం. ఎవరూ వేస్ట్ గా వుండరు. అదే నాకు పెద్ద ఛాలెంజ్
.
విక్టోరియా పురం అనేది కథకు ఏమిటి సంబంధం?
ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ లో వున్నదే విక్టోరియా పురం. కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడ చెఫ్ పెట్టే కాఫీని రాణి చాలా ఇష్టంగా తాగుతారు. అలా ఆ ఊరు ఫేమస్ అయింది. కాఫీ ఎస్టేట్, రెండుకుటుంబాలు, నాలుగు జనరేషన్స్, కోర్టు కేసు ఇలా అన్ని అంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంటుంది.
సహజంగా ఫ్యామిలీ కథలు సక్సెస్ అయితే మాస్టర్ పీస్ అవుతుంది. గాడి తప్పితే బోర్ గా ఫీలవుతారు? ఇందులో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
కథకు కావాల్సిన అంశాలు వుంటూ కథ జరిగే క్రమంలో అందరికీ ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా వుంటాయి. దానితోపాటు ఎంటర్ టైన్ చేశామాలేదా అనేది కూడా చూసుకుంటాను. అందుకే అన్ని పాత్రలతో అల్లుకుపోతూ అందరినీ మెప్పించే ప్రయత్నం నేను చేశా. ఓబేబీ లో సెకండాఫ్ కీలకం. ఇందులో అంతే. ప్రేక్షకుల్ని టచ్ చేస్తుంది.
ఓ బేబీ లో సమంత వుంది కాబట్టి ఎమోషన్ డీల్ చేసింది. ఈ సినిమాలో హీరో పై అంత ఎమోషన్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్?
ఈ విషయం పై రేపు సినిమా విడుదలయ్యాక మీరే చెబుతారు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెస్ట్ క్లయిమాక్స్ ఈ సినిమాకు రాశాను అనుకుంటున్నా. చివరి 20 నిముషాలు నా కెరీర్ ఆధారపడి వుంటుంది. ది బెస్ట్ అని చెప్పగలను. ఇప్పటికే 30మందికిపైగా బయటివారు సెన్సార్ వారూ చూశాక ది బెస్ట్ అన్నారు. మీరు సినిమా చూశాక హీరో పాత్రను ప్రేమిస్తారు. అలా అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటుంది. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా.
రచయిత లక్ష్మీభూపాల్ తో మీ జర్నీ ఎలా వుంది?
తను నా బ్రదర్ లాంటివాడు. ఎమోషనల్ సీన్స్ బాగా రాయగలడు. నా సినిమాకు భూపాల్ ప్రేమతో రాస్తాడు. కథ చర్చించుకున్నప్పుడు అంచనా వేయగలడు. అంత ముందు చూపు ఉంది తనకి.
విక్టోరియా పురం అనేది దేనికి స్పూర్తి ?
ఇది కేవలం కల్పితమే. ఏ సినిమాకూ కనెక్షన్ లేదు.
విక్టోరియా పురం ఐడియా ఎవరిది?
రైటర్ షేక్ దావూద్ ఐడియా ఇది. కథ అనుకున్నప్పుడు ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించాలని క్రియేట్ చేశాడు. అలా వచ్చిన కథే ఇది. విక్టోరియాపురం ప్యాలెస్ కునూర్ లో షూట్ చేశాం.
చాలా విరామం తర్వాత వాసుకి, షావుకారు జానకి, గౌతమి వంటివారిని ఎంపిక చేసుకోవడానికి కారణం?
వీరందరినీ కథ డిమాండ్ మేరకే తీసుకున్నాం. రాజేంద్రప్రసాద్ లాంటి ఆర్టిస్టు వుంటే వారి స్థాయికి తగినవారు వుండాలి. రావురమేష్, నరేష్ వీరంతా బిజీగా వున్నారు. వారందరూ ఫ్యామిలీగా ఫిల్ అయి ఈ సినిమా ఇంట్రెస్ట్ తో చేశారు. ఇక మాళవిక మదర్ అంజుతో సహా కొత్త వారు అయితే స్క్రీప్ పై ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తారని తీసుకున్నాం.
కుదిరితే ఓ కప్పు కాఫీ సినిమా కూ దీనికి ఏమైనా పోలిక ఉందా?
అదేమీ లేదు. ఇందులో కేఫ్ లేదు. కాఫీ ఎస్టేట్, నాలుగు తరాలనుంచి జరుగుతున్న భూమి తగాదా గురించి కథ.
డ్రామా కామెడీ అనేది అర్బన్ సెటప్ లో ఎలా డీల్ చేయగలిగారు?
ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. హిల్ స్టేషన్ లో వారి లైఫ్ ఎలా వుంటుంది. అక్కడ కాఫీ షాప్ లు, మాల్స్ వుండవు. అయినా వారికి ఎంటర్ టైన్ మెంట్ ఏమిటి. అనేది సినిమాలో చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు.
కోవిడ్ ముందు కథ రాసుకున్నారు గదా? ఆ తర్వాత ప్రేక్షకులు ఆలోచనలు మారాయి. అందుకు తగిన విధంగా మార్పులు చేశారా?
తప్పకుండా ప్రేక్షకులు ఆలోచనలు మారాయి. అందుకే కొన్ని మార్పులు జరిగాయి.
ఈ సినిమాకు ముందు పెద్ద హీరోను అనుకున్నారని తెలిసింది. నిజమేనా?
అదేమీ లేదు. కథ చాలా సింపుల్ గా వుంటుంది. సంతోష్ పాత్ర కూడా చాలా కూల్ గా వుంటుంది. ఎవరితోనూ గొడవ పడే రకం కాదు. అందుకే ఆయన్ని తీసుకున్నాం. హీరోను మార్చి పెద్ద రేంజ్‌లో తీయాలంటే కుదరదు. కథకు గౌరవం ఇవ్వాలి. లేదంటే దేనికీ న్యాయం చేయలేము.
రన్ టైమ్ ఎంత?
2.34 నిమిషాలు.
మిక్కీ జెమేయర్ సంగీతం ఎంతవరకు హెల్ప్ అయింది?
ఈ సినిమాకు మిక్కీనే సోల్. ఈ కథ చెప్పినప్పుడు నువ్వే సూపర్ స్టార్ అని చెప్పాను. క్లయిమాక్స్ రాసేటప్పుడు ఆ ఫీల్ కు అనుగుణంగా నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఇందులో చివరిలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. కానీ భూపాల్ నాలుగు పేజీల డైలాగ్స్ రాశాడు. కానీ కథ డిమాండ్ మేరకు వుంచాం. నిజాయితీగా క్లయిమాక్స్ వుండాలని చేసిన సినిమా. అందుకు మిక్కీ సంగీతం చాలా హెల్ప్ అయింది.
స్వప్న, ప్రియాగారు, అశ్వనీత్ దత్‌గారు, నాగ్ అశ్విన్ ఇంతమంది వుండడంతో మీ మేకింగ్ లో ఇంటర్ ఫియర్ అయ్యారా?
ఎవరూ ఇంటర్ ఫియర్ అవ్వలేదు. మా మధ్య ఎటువంటి క్లాష్ లు లేవు. అందరూ కథ చర్చించుకుని ఔట్ పుట్ వచ్చాక నాగీకి చూపిస్తే చిన్నపాటి సలహాలు ఇచ్చారు. అవి పాటించాం.
స్వప్నగారు ఇంతకుముందు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అందుకే ఈ సినిమాపై మీకు ఒత్తిడి వుందా?
తప్పకుండా వుంటుంది. వారు సక్సెస్ ఇచ్చారు. నేనూ సక్సెస్ ఇవ్వాలనే కసితో చేశాను. టెన్షన్ వుంటుంది. అయితే ఇప్పటివరకు చూసినవారంతా చెప్పిన ఫీడ్ బ్యాక్ తో ఆ టెన్షన్ కూడా పోయి హ్యాపీగా వుంది.
మీ సినిమాలన్నీ పెండ్లి నేపథ్యాలు వుంటున్నాయే?
కథకు అనుగుణంగానే చేస్తున్నాను. నాకూ ఆశ్చర్యంగానే వుంటుంది. పెద్ద హీరోలతో చేయాలని వుంటుంది. అయితే కథ డిమాండ్ మేరకే చేస్తున్నా. అలా మొదలైంది నుంచి ఓ బేబీ వరకు చూసుకుంటే అలానే అనిపిస్తుంది. ఓ బేబీ తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ టైంలో స్వప్నగారితో ఈ కథ కుదిరింది.
మీ తదుపరి సినిమాలో సమంత వుంటుందా?
హీరోగా సిద్దు ఫిక్స్. సమంత అనుకోలేదు.
దర్శకులుగా గ్యాప్ రావడానికి కారణం వుందా?
నాకు స్క్రిప్ట్ ను పూరీ గారిలా స్పీడ్ గా రాయడం కుదరదు. సోలో రచయితగా రాస్తున్నప్పుడు టైం పడుతుంది. అందుకే ఇప్పుడే రచయితల టీమ్ ను పెట్టుకున్నాను. ఈ సినిమాకు నాకు మంచి స్లాట్ దొరికింది. నాకు పెద్దగా గ్యాప్ అనిపించలేదు. ఎందుకంటే ఆ గ్యాప్ లో కథలు రాసుకున్నా.
సింపుల్ కథ అన్నారు. రెండేళ్ళు ఎందుకు పట్టిందంటారు?
కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు పట్టింది. 2019లో పిట్టకథలు చేశా. ఆ తర్వాత రెండేళ్ళు లాక్‌డౌన్. ఆ టైం లో కొన్ని లొకేషన్లకు పర్మిషన్ లేదు. కునూర్ లోకొన్ని రూల్స్ వున్నాయి. ఆ తర్వాత అందరూ ఆర్టిస్టుల కాంబినేషన్ కుదరాలి. యు.ఎస్., యూరప్ లో చేయడానికి పర్మిషన్ రాలేదు. ఇలా టైం పట్టింది.
కోవిడ్ తర్వాత ఓటీటీ పుంజుకుంది దాంతో కథల్లో మార్పు వచ్చింది. మీకు ఛాలెంజ్ అనిపించిందా?
రొటీన్ గా కథలు చెప్పకుండా వుండడమే దానికి పరిష్కారం. అందుకే ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఊహించని విధంగావుండేలా రాస్తున్నాను. జాతిరత్నాలు, బలగం వంటి సినిమాలు వచ్చాయంటే చిన్న పాయింట్ అయినా కుటుంబమంతా కలిసిచూసి ఎంజాయ్ చేసేలా వుంది. అందుకే అలాంటి కథలు వుంటే ఓటీటీనుంచి బయటకు వచ్చి థియేటర్ లో చూస్తారు. ఆ ప్రయత్నమే నా సినిమా.
ఇప్పుడు ఏ సినిమాకూ మార్నింగ్ షోకు ప్రేక్షకులు రావడంలేదు. ఈ ప్రభావం మీ సినిమా కు వుంటుందనుకుంటున్నారా?
నా మొదటి సినిమా అలా మొదలైంది నుంచి ఓ బేబీ వరకు మార్నింగ్ షోకు పెద్దగా ప్రేక్షకులు లేరు. తర్వాతర్వాత మౌత్ టాక్ తో విపరీతంగా వచ్చి చూశారు.
అన్నీ ఫ్యామిలీస్ పెండ్లి కథలేనా? కొత్తవి ఏమైనా చేస్తున్నారా?
నా నెక్ట్స్ చిత్రం ఊహించని కథతో రాబోతున్నా. వినూత్నంగా వుంటుంది. అన్నారు.