మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్ టి టీమ్ వర్క్స్ లో మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించారు. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీని పెంచింది. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ విడుదలౌతున్న ఈ నేపధ్యంలో హీరో కార్తీక్ రత్నం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘ఛాంగురే బంగారురాజా’ ఎలా వుండబోతుంది ?
‘ఛాంగురే బంగారురాజా’ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కామెడీ థ్రిల్ యాక్షన్ అన్నీ వుంటాయి. కుటుంబం అంతా కలసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయి చూడదగ్గ చిత్రం. చాలా నవ్విస్తుంది.
ట్రైలర్ లో రంగురాళ్ళు చుట్టూ కథ నడిచినట్లు అనిపించింది ?
అవునండీ. కొన్ని కొండ ప్రాంతాల్లో రంగురాళ్ళు దొరుకుతాయి. ఐతే అవి నిషిద్ద ప్రాంతాలు. కానీ కొందరు రిస్క్ చేసి అక్కడ రంగురాళ్ళ కోసం తవ్వకాలు చేస్తారు. కొనుక్కునే వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. ఈ కథ బ్యాక్ డ్రాప్ కూడా ఆ నేపధ్యంలో వుంటుంది. ఇందులో ఓ నాలుగు గ్యాంగ్ లు వుంటాయి. దాదాపు సినిమా అంతా గ్యాంగ్ ల ఛేజింగ్ వుంటుంది. ఆ వెంటపడటంలో కూడా కామెడీ వుంటుంది.
ఈ ప్రాజెక్ట్ ఎలా పట్టాలెక్కింది ?
నేను ‘నారప్ప’ చేస్తున్నపుడు సతీష్ ఆ చిత్రానికి అసోషియేట్ డైరెక్టర్ గా చేశారు. దాదాపు ఓ రెండు నెలలు పాటు క్లోజ్ గా ప్రయాణించాం. అప్పటివరకూ నేను అన్నీ సీరియస్ గా వుండే పాత్రలు చేశాను. ఐతే ఈ ప్రయాణంలో నేను మంచి కామెడీ కూడా చేస్తానని, నా కామెడీ టైమింగ్ బావుందని సతీష్ కి నమ్మకం కుదిరింది.అప్పుడు ఈ కథ చెప్పారు. ఎలాగైనా చేయాలని అనుకున్నాం. నిర్మాతల కోసం తిరిగారు. ఒక రోజు సతీష్ ఫోన్ చేసి.. మన సినిమా ఓకే అయ్యింది. రవితేజ గారు నిర్మిస్తున్నారని చెప్పారు. మొదట రవితేజ గారు అంటే ఏ నిర్మాతో అనుకున్నాను. కానీ మాస్ మహారాజా రవితేజ గారని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యాను. ఐతే రవితేజ గారు లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుందంటే అందులో నేను హీరోగా వుండనేమో అని కూడా అనుకున్నాను. ‘నువ్వే హీరో’’ అని సతీష్ చెప్పిన తర్వాత నా ఆనందానికి హద్దులు లేవు. ఆ రోజు నేను, సతీష్ హైదరాబాద్ అంతా చుట్టేశాం(నవ్వుతూ)
రవితేజ గారు ఈ చిత్రాన్ని పెద్ద వంశీ సినిమాలతో పోల్చారు కదా ?
అవునండీ.. ఇందులో అలాంటి ఫ్లేవర్ కనిపిస్తుంది. హీరో, విలన్ అని కాకుండా ప్రతి పాత్రలో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ వుంటాయి. రవి బాబు గారు, సత్యతో మిగతా పాత్రలన్నీ చాలా హిలేరియస్ గా వుంటాయి. రవిబాబు గారు అద్భుతమైన టైమింగ్ యాక్టర్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
మీరు చాలా సీరియస్ రోల్స్ చేశారు కదా.. మొదటిసారి ఇలాంటి ఎంటర్ టైనర్ చేయడం ఎలా అనిపించింది?
ఇంతకుముందు చేసిన సీరియస్ పాత్రలలో మాడ్యులేషన్, డైలాగ్, లుక్, వాయిస్ ఇవన్నీ ఆ పాత్రలకు తగ్గట్టుగా వుండాల్సివచ్చింది. ఇందులో మాత్రం నేను సహజంగా ఎలా ఉంటానో అలా వుంటే చాలు. ఇది నాకు చాలా ఈజీ అనిపించింది. కామెడీ చేయడం చాలా కష్టం అంటారు. కానీ రైటింగ్ బావుంటే ఈజీగా చేయొచ్చనిపించింది.
సత్యతో మీ కామెడీ ఎలా వుంటుంది?
సత్య తో కామెడీ చాలా బావుంటుంది. నిజానికి సత్య ట్రాక్ అంతా హిలేరియస్ గా వుంటుంది. సత్యకి అద్భుతమైన కామెడీ టైమింగ్ వుంటుంది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సత్య, నిత్య ట్రాక్ కూడా హిలేరియస్ గా వుంటుంది.అలాగే నాది, గోల్డీ నిస్సీ ట్రాక్ కూడా ఇంట్రస్టింగా వుంటుంది. నటించడానికి స్కోప్ వుండే పాత్రలు దొరికాయి.
ముఖ్యంగా ఇందులో స్క్రీన్ ప్లే కొత్తగా వుంటుంది. పాత్రలన్నీ ఒకే సంఘటనతో ఎలా ముడిపడ్డాయి, ఆ క్రైమ్ లో ఎలా ఇరుక్కున్నారనేది ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో ఒక జర్మన్ షెఫర్డ్ డాగ్ వుంటుంది. దానికి సునీల్ గారు వాయిస్ ఇచ్చారు. అది ఈ పాత్రలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో కామెడీ మెయిన్ హైలెట్. ఫైట్స్ కూడా సహజంగా వుంటాయి. కథలో వచ్చే యాక్షన్ వుంటుంది.
రవితేజ గారు సినిమా చూశారా ?
చూశారు. రవితేజ గారికి సినిమా చాలా నచ్చింది. సత్య నిత్య ట్రాక్ ని హిలేరియస్ గా ఎంజాయ్ చేశారు. అలాగే ఇందులో కథ, కథనం ను కూడా చాలా నచ్చింది. నాది వెరైటీ టైమింగ్ అన్నారు. రవితేజ గారు చెప్పిన తర్వాత అది నేను గుర్తించాను. (నవ్వుతూ). అలాగే మ్యూజిక్ పరంగా కూడా చాలా యంగేజింగా వుంటుంది. ఇందులో మూడు పాటలు వుంటాయి.
రవితేజ గారి ప్రొడక్షన్ లో తొలిసారి ఫుల్ లెంత్ రోల్ చేయడం ఎలా అనిపించింది ?
రంగస్థలం నుంచి పరిశ్రమకు వచ్చాను. చాలా ప్రదర్శనలు ఇచ్చాను. చిన్నప్పుడు మొదటి నాటకానికే నంది అవార్డ్ వచ్చింది. పరిశ్రమకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. పరిశ్రమలో రాణించాలనే వారికి రవితేజ గారు, నాని గారు లాంటి వారు స్ఫూర్తి. అలాంటిది రవితేజ గారి నిర్మాణంలోనే సినిమా చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను నటుడు కావడానికి స్ఫూర్తి రవితేజ గారు. ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది ఆయన నిర్మాణంలోనే సినిమా చేయడం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి.
దర్శకుడు సతీష్ వర్మ బలాలు ఏమిటి ?
తన రైటింగ్ చాలా బలంగా వుంటుంది. అలాగే ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్ కూడా చాలా బావుంటుంది.
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో బంగారురాజు పాత్ర చాలా కమర్షియల్. డబ్బులు ఇస్తేనే పని చేసేరకం. ఐతే దీనికి కూడా తన జీవితంలో జరిగిన సంఘటనలు కారణం. అలాంటి పాత్రకు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ అవసరమో దానిపై వర్క్ చేసి డిజైన్ చేశాం.
‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ ఎలా వచ్చింది ?
ఇందులో నా పాత్ర పేరు బంగారు రాజు. బంగారు రాజు గతానికి ఈ టైటిల్ ముడిపడివుతుంది. ఈ టైటిల్ కథకి యాప్ట్.
ఇకపై సోలో హీరోగా వెళ్తారా ? ఇతర పాత్రలు కూడా చేస్తారా ?
సినిమాల్లో నటించడానికి వచ్చాను. నటుడిగా నచ్చిన పాత్రని చేస్తాను. ఎన్ని సినిమాలు చేస్తే అంత మంచిదని భావిస్తాను.
రవితేజ గారి ప్రొడక్షన్ గురించి ?
రవితేజ గారి నిర్మాణంలో నటించేడమే క్రేజీగా అనిపిస్తుంది. ఇందులో అందరూ కొత్తవాళ్ళు. ఎవరికీ బ్యాగ్రౌండ్ లేదు. ఇది నిర్మాతల గొప్పదనం. మొత్తం దర్శకుడి చేతిలో పెట్టారు. అలాగే ఫ్రేం బై ఫ్రేమ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా అసోసియేషన్ వుంది. శాలిని, ఆర్కే, వింధ్య, శ్వేత, శ్రీధర్ గారు వీరంతా చాలా సౌకర్యం ఇచ్చి చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు.
కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
‘శ్రీరంగనీతులు’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ప్రకాష్ రాజ్ గారు, ఎఎల్ విజయ్ కలసి ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో తెలుగు వెర్షన్ లో నేను నటిస్తున్నాను.