వీడియో: చికాగో.. ద డే ఆఫ్ట‌ర్ టుమారో

సుమారు 18 ఏళ్ల కింద‌ట ఇంగ్లీష్‌లో ఓ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీ విడుద‌లైంది. ఆ మూవీ పేరు `ద డే ఆఫ్ట‌ర్ టుమారో`. పోలార్ వొర్టెక్స్ ప్ర‌భావం వ‌ల్ల అమెరికా ఎలా త‌యార‌వుతుంద‌నేది స్థూలంగా ఆ సినిమా క‌థాంశం. చ‌లి దెబ్బ‌కు గ‌డ్డక‌ట్టుకుపోయిన క‌ట్ట‌డాలు, లిబ‌ర్టీ స్టాచ్యూ, న‌దులు, స‌ర‌స్సుల‌ను భ‌లేగా చూపుతారా సినిమాలో.

చ‌లి తీవ్ర‌త‌కు క్ష‌ణ‌క్ష‌ణానికీ గ‌డ్డ‌క‌ట్టుకుని పోతుంటాయి. వీఎఫ్ఎక్స్ ద్వారా మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తెర‌కెక్కించారు ఆ సినిమాలోని స‌న్నివేశాలను. 2004లో ఆ సినిమా విడుదల కాగా.. అచ్చం అలాంటి ప‌రిస్థితులే ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా క‌ళ్ల‌ముందు నిల్చున్నాయి ఆ దేశంలో. ప్ర‌త్యేకించి- చికాగోలో.

పోలార్ వొర్టెక్స్ దెబ్బ‌కు అక్క‌డి వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా ఫ్రీజ్ అయిపోయింది. రోజురోజుకూ అక్క‌డి ఉష్ణోగ్ర‌త క్షీణిస్తోంది. ఉద‌యం పూట 10 డిగ్రీల ఫారెన్ హీట్ వ‌ర‌కు ఉన్న టెంప‌రేచ‌ర్‌.. చూస్తుండ‌గానే మైన‌స్‌లోకి జారిపోతోంది. గంట‌లు గ‌డిచే కొద్దీ దాని తీవ్ర‌త అధిక‌మౌతోంది.

చికాగోలో బుధ‌వారం -24 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్ర‌త నమోదైంది. ఉష్ణోగ్ర‌త మ‌రింత క్షీణించ‌వ‌చ్చ‌ని నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్ వెల్ల‌డించింది. చికాగోకు సుమారు 98 మైళ్ల దూరంలో ఉన్న లేక్ మిచిగాన్ దాదాపు గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది. చ‌లిగాలుల తీవ్ర‌త లేక్ మిచిగాన్‌లో అధికంగా ఉంది.

అట్లాంటాతో పాటు ప‌లు చోట్ల ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో వారం రోజుల పాటు క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు కొన‌సాగుతాయ‌ని ఎన్‌డ‌బ్ల్యూఎస్ తెలియ‌జేసింది. చికాగో విమానాశ్ర‌యం దాదాపుగా మూత ప‌డింది. ఇక్క‌డి ఓహ‌రే అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేరాల్సిన 1600 విమానాల‌ను ర‌ద్దు చేశారు. చాలావాటిని దారి మ‌ళ్లించారు.

https://twitter.com/dodgerman/status/1090603398175559682