అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు, ఆయన కుమార్తె మరియం కు అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇది రాజకీయపరమైన కుట్ర కేసు అంటూ నవాజ్ షరీఫ్ ఆరోపించారు. తమ కుటుంబం మీద పెట్టిన కేసులు నిలబడవని అన్నారు. అయితే ప్రస్తుతం నవాజ్ షరీఫ్ ఆయన కుమార్తె ఇద్దరూ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
పాకిస్తాన్ చట్టాల ప్రకారం రాజకీయ హోదా కలిగిన ఖైదీలకు జైలులో కొంత మేరకు సౌకర్యాలు కల్పిస్తారు. జైలులో ఉన్న మరియం తనకు కల్పించిన బి క్లాస్ సౌకర్యాలను రిజెక్ట్ చేశారంటూ పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. బి క్లాస్ సౌకర్యాలు అంటే పరుపు, టేబుల్, కుర్చీ, సీలింగ్ ఫ్యాన్, టివి, పత్రికలు ఇవన్నీ అనుమతిస్తారు. అయితే ఈ సదుపాయాలన్నీ సొంత ఖర్చులతోనే పొందే చాన్స్ ఉంటుంది. కానీ ఈ సదుపాయాలేవీ తాను వినియోగించుకోవడంలేదని ఆమె రాసిన లేఖ ఇదే అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. తనకు ఇచ్చిన సదుపాయాలు వద్దనుకోవడంలో ఎవరి జోక్యం లేదని కూడా ఆమె పేర్కొన్నట్లు చెబుతున్నారు.
ఇక తన తండ్రి అయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఎ క్లాస్ సౌకర్యాలు కల్పించారు జైలు అధికారులు. ఆయనతోపాటు మాజీ సైనికాధికారి, పార్లమెంటు సభ్యుడైన సఫ్దర్ కు కూడా బి క్లాస్ సౌకర్యాలు అందుతున్నాయి. కానీ అడియాలా జైల్లో ఉన్న తన తండ్రి నవాజ్ షరీఫ్ కు కనీసం పరుపు కూడా ఇవ్వలేదని ఆయన తనయుడు హుస్సేన్ నవాజ్ షరీఫ్ ఆరోపించారు.
ఇదిలా ఉంటే ఇస్లామాబాద్ కోర్టులో అప్పీల్ వేసేందుకు న్యాయవాదులు జైలుకు వచ్చి నవాజ్ షరీఫ్ తో పాటు ఆయన కూతురు మరియం తో సంతకాలు తీసుకున్నారు. మొత్తానికి మరియం తనకు సౌకర్యాలు వద్దని నిరసన తెలిపేందుకు చెప్పారా? లేక ఆవేదనతో రిజెక్ట్ చేశారా అన్నది చర్చనీయాంశమైంది.