ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దారుణాలకు అడ్డులేకుండా పోతుంది. పసి మొగ్గలను కూడా వదలడం లేదు మృగాళ్లు. ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన చిన్నారులు అకృత్యాలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కొలంబియాలో దారుణం వెలుగు చూసింది. అమ్మ ప్రేమ, నాన్న గారం.. స్నేహితులు, ఆటలు తప్ప మరొకటి తెలియని పదేళ్ల చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
అభం శుభం తెలియని ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆ బాలికకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చిన నెల రోజులకు ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఆమెను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని వైద్య సంరక్షణ కేంద్రంలో ఉంచారు. మరో దారుణం ఏంటంటే తనకు ఏం జరిగిందో.. ఎవరు తనపై ఇంత పశుత్వాన్ని ప్రదర్శించారో ఆ చిట్టితల్లి చెప్పలేకపోతుంది.
దీనిపై కేసు నమోదు చేశామని, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ బాలిక సవతి తండ్రి(43), పొలాల్లో పని చేసే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.