మీరు పానీపూరి తింటున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి!

think twice before having panipuri from street side vendors

పానీ పూరి..  చాలా మంది లోట్టలేసుకుంటూ తింటారు అందరికీ ఇది హాట్ ఫేవరెట్. ఈ ఆహార పదార్థాన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరేమో. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడతారు. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే చిరుతిండ్లలో పానీ పూరీ ఒకటి. దీనిని తినేందుకు చాలా ఇష్టపడతారు. చిన్నపాటి పూరీలను నూనెలో వేస్తే గుండ్రంగా బాల్స్ లా తయారు అవుతాయి.

వాటిలో బఠాణీలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలతో పాటు మసాలను జోడించి పెడతారు. కొన్ని మసాలలతో ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న నీటిలో ముంచి ఆహారంగా తీసుకుంటారు. ఆయాప్రాంతాలను బట్టి పానీ పూరిలో వినియోగించే పదార్ధాల్లో కొంచెం తేడా ఉంటుంది. ప్రస్తుతం ఇది భారతదేశంలో ముఖ్యమైన స్ట్రీట్ ఫుడ్ గా మారిపోయింది.

నగరాల్లో, పట్టణాల్లో ఏ గల్లీకి వెళ్ళినా పానీ పూరీ విక్రయించే బండ్లు దర్శనమిస్తుంటాయి. సాయంత్రం వేళల్లో ఈ బండ్ల వద్ద ఎంతో హడాహుడి కనిపిస్తుంటుంది. వాటి వద్ద నిలబడి చాలా మంది పానీ పూరీలను ఇష్టంగా లాగించేస్తుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి సైతం ఈ బండ్ల వద్ద పానీపూరీలను లాగించేవారు నగరాల్లో చాలా మంది ఉన్నారు. మరోవైపు అనేక మంది ఈ పానీ పూరీలను ఇంట్లోనే తయరు చేసుకుంటున్నారు.

చిన్నారులు వీటిని తినేందుకు ఇష్టపడతుండటంతో తల్లిదండ్రులు వీటిని తయారు చేసి సాయంత్రం వేళలో చిరుతిండిగా అందిస్తున్నారు. చిరుతిండ్ల‌ను తినేందుకు స‌హ‌జంగానే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. నగరాల్లో చాలా మంది రాత్రి భోజనం చేయటం వల్ల బరువు పెరుగుతామన్న ఆలోచనతో పానీపూరీలను లైట్ ఫుడ్ గా భావిస్తూ ఆహారంగా తీసుకుంటుంటారు. అందులోను పానీ పూరీ కాస్త స్పైసీగా, నోట్లో వేసుకుంటే అందులోని సారమంతా నాలుకకు తగిలితే ఎంతో రుచిని ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది సాయంత్రం వేళ దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు.

వర్షం బాగా పడుతోంటే, వేడి వేడిగా పకోడీలో లేకపోతే పానీ పూరీనో తింటే భలే మజా వస్తుంది కదా. కానీ, ఈ జోరు వర్షాల్లో పానీ పూరీ జోలికి, ఆ మాటకొస్తే, బయటి ఫుడ్ జోలికి అస్సలు పోవద్దని ఆరోగ్య శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కోవిడ్ ఇంకా వదిలి పోలేదు. కొత్త వేరియంట్ల రూపంలో ఇంకా మనతోనే సహజీవనం చేస్తోంది. గత ఐదు రోజులుగా కంటిన్యూస్‌గా పడుతున్న వానల కారణంగా విష జ్వరాలూ, డెంగ్యూ, టైఫాయిడ్ వంటివి కోరలు చాచి కూర్చున్నాయి.

ఈ తరుణంలో బయటి ఫుడ్స్‌ని ముఖ్యంగా పానీ పూరీని పూర్తిగా అవైడ్ చేయమని ప్రజల్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలూ అందరూ ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ ల సమయంలో చాలా మందిలో తాము స్ట్రీట్ ఫుడ్ గా భావించే పానీ పూరీని తినలేక పోయామన్న బాధవారిలో స్పష్టంగా కనిపించింది.

ఇదిలావుంటే పానీ పూరీని తినటం వల్ల కొన్ని అనారోగ్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పానీ పూరీల‌ను నూనెలో వేయిస్తారు. ఆ పూరీల త‌యారీకి మైదా పిండి వినియోగిస్తారు. వీటిని వేయించేందుకు వాడే నూనెతోపాటు త‌యారు చేసేందుకు వాడే మైదా పిండి.. ఆరోగ్యానికి మంచిది కాదు. రోజువారి ఆహారంగా పానీపూరీల‌ను తీసుకోవటం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వీటిని అధికంగా తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. దీని వల్ల బరువు పెరుగుతారు. అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజు అదేపనిగా తినటం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు , మ‌ధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు పానీపూరీల‌ను తినకపోవటమే ఉత్తమమని వైద్య నిపుణులు చెపుతున్నారు.