భూమి ఎప్పుడు అంతరించిపోతుందో తెలియదు. ఇంత పెద్ద విశ్వంలో జీవజాతులకు అనువైన ప్రదేశం భూమి మాత్రమే. నీరు, గాలి, నిప్పు.. అన్నీ ఇక్కడే లభ్యమవుతాయి. కానీ.. భూమిపై సునామీలు, భూకంపాలు, కాలుష్యం, అణు యుద్ధం, గ్లోబల్ వార్మింగ్.. తో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొన్ని కోట్ల ఏళ్ల కిందట భూమిపై డైనోసార్లు అంతమైపోయాయి. వాతావరణ మార్పులు, టెక్నాలజీతో కొన్ని జీవ జాతుల ఉనికే కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా చంద్రుడి మీద స్పెర్మ్ బ్యాంక్ ఏర్పాటు చేసి మానవుల స్పెర్మ్ ను అక్కడ దాచాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఈ నేపథ్యంలో వీర్యం, అండాలను పంపించాలని ఎందుకు చెప్తున్నారనే సందేహాలు లేకపోలేదు. అమెరికాలోని ఓ యూనివర్శిటీ ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం దీనిపై లోతైన అధ్యయనం చేసింది. చంద్రుడిపై స్పెర్మ్ బ్యాంక్ ఏర్పాటు చేసి భూమి ఉన్న 6.7 మిలియన్ జాతుల వీర్యం, అండాలను చంద్రుడి మీదకు చేర్చాలని అంటున్నారు. అక్కడ 80 నుంచి 100 మీటర్ల లోతు అండర్ గ్రౌండ్‌లో స్టోర్ చేయాలని సూచిస్తున్నారు. చంద్రుడిపై చల్లని వాతావరణం కారణంగా ఎన్నేళ్లయినా స్పెర్మ్ భద్రంగా ఉంటుందని అంటున్నారు. భూమిపై జీవం అంతమైనా చంద్రుడిపై ఉనికి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ‘మోడ్రన్ గ్లోబల్ ఇన్సురెన్స్ పాలసీ’గా దీనిని అభివర్ణిస్తున్నారు.
ఇప్పటికే ఆర్కిటిక్ సర్కిల్‌లో స్పిట్స్ బెర్గన్ ఐలాండ్‌లో స్వాల్‌బార్డ్ సీడ్ వాయుల్ట్‌లో చెట్ల విత్తనాలను స్టోర్ చేస్తున్నారు. ఇదే మనుషుల స్పెర్మ్ చంద్రుడిపై ఉంచాలనే వాదనకు బలం చేకూరుస్తోందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రస్తుతానికి ఇవన్నీ చర్చల దశలోనే ఉన్నా రాబోయే రోజుల్లో దీనిపై మరింత చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చంద్రుడు, మార్స్ పై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. మనిషి జీవించేందుకు ఉన్న అవకాశాలపై పరిశోధనలు పరిశోధిస్తున్నారు. అయినా.. కొన్నేళ్లకు అక్కడ జీవించేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ స్థలాలు కొంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో విశ్వంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో..!