ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల ..మన ఆరోగ్యానికి లాభమా..? నష్టమా…?

గుడ్డు సంపూర్ణ పోషకాల నిలయం.మన రోజువారి జీవక్రియకు అవసరమైన అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్,మినరల్స్,విటమిన్ ఎ , డి, ఈ, బి-కాంప్లెక్స్‌ వంటి పోషకాలు గుడ్డులో సమృద్ధిగా లభిస్తాయి.అయితే ఉడకబెట్టిన గుడ్డును ప్రతి రోజు తినడం వల్ల శరీర బరువు పెరగడంతోపాటు అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ వ్యవస్థ,గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని గుడ్లు తినడం మానేస్తున్నారు.ఇది అపోహ మాత్రమే. రోజువారి ఆహారంలో పోషకాహార లోపాన్ని సవరించుకోడానికి పరిమితంగా ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పిల్లలు ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల శారీరక,మానసిక ఎదుగుదలతో పాటు,మెదడు చురుకుగా పనిచేస్తుందని పేర్కొంది. ముఖ్యంగా గుడ్డు పచ్చదనలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీర కణాల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తగిన శక్తిని ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.గుడ్డులో ఉండే విటమిన్ ఏ,ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి చూపును మెరుగు పరిచి భవిష్యత్తులో కంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

గుడ్డులోని పచ్చసొనలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుందని దీన్ని తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం వచ్చే ముప్పు కూడా తక్కువ. అలాగే వృద్ధాప్యంలో మెదడు సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

గుడ్డులో పుష్కలంగా ఉన్న విటమిన్ డి, కాల్షియం వృద్ధాప్యంలో వచ్చే ఎముకలు పెళుసుగా మారడం,కీళ్ల నొప్పులు, రుమటాయిడ్, కీళ్లవాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ ఈ చర్మ సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఒకరోజులో పరిమితికి మించి గుడ్లను ఆహారంగా తీసుకుంటే దీనివల్ల మన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వైద్యుల్ని సలహా మేరకు గుడ్లను తినడం మంచిది.