మనందరికీ ఇష్టమైన కాయ కూరల్లో క్యారెట్ కచ్చితంగా ఉంటుంది. క్యారెట్ తో ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా క్యారెట్ హల్వా అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అలాగే చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే క్యారెట్ ను జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు. క్యారెట్లు ఏ రూపంలో తీసుకున్న మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. కొంతమంది పచ్చి క్యారట్లను తినడానికి సంకోచిస్తుంటారు. మన సంపూర్ణ ఆరోగ్యానికి పచ్చి క్యారెట్లు మరింత మెరుగైన ఫలితాలను అందిస్తుందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
క్యారెట్లను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఇందులో సహజ ఔషధ గుణాలు, పోషక విలువలు ఎంతో కొంత నశించిపోతాయి. కావున రోజుకు ఒకటి లేదా రెండు క్యారెట్లను పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే వీటి నుంచి లభించే సంపూర్ణ పోషక విలువలను మనం సంపూర్ణంగా పొందవచ్చు. పచ్చి క్యారెట్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, ఫైటో కెమికల్స్ సమృద్ధిగా లభిస్తాయి.మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరిచి కంటి సమస్యలను తొలగిస్తుంది. ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల నియంత్రణలో అద్భుతంగా సహాయపడుతుంది. చర్మం లోని మృత కణాల సంఖ్యను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
ప్రమాదకర లుకేమియా వ్యాధితో బాధపడేవారు తరచూ పచ్చి క్యారట్లను లేదా క్యారెట్ రసాన్ని సేవిస్తే వ్యాధిని అదుపులో ఉంచవచ్చునని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పచ్చి క్యారట్లను నమిలి తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు పళ్ళ సందుల్లోని ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేసి దంతక్షయాన్ని అరికడుతుంది, చిగుళ్ల ఆరోగ్యాన్ని రక్షించి నోటి దుర్వాసనను పోగొడుతుంది. క్యారెట్లు సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా రక్తంలోని గ్లూకోజ్ నిల్వలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అయితే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు పచ్చి క్యారట్లను తినే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. జీర్ణం అవడంలో ఆలస్యం జరిగి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.