వర్మ నటుడుగా మారటానికి గల కారణం ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇన్నాళ్లూ దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేసిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు. ఈ రోజు వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

గన్‌ షాట్‌ ఫిలింస్‌ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ ప్రాజెక్ట్‌తో తొలిసారిగా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడని చెప్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌ ఇబ్బందుల్లో ఉన్న వర్మ తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో మరోసారి సక్సెస్‌ ట్రాక్‌లో వచ్చాడు. దాంతో ఆ ఉత్సాహంలో ఈ నిర్ణయం ప్రకటించారు.

ఇక గతంలోనూ వర్మను తమ సినిమాల్లో నటించమని కొంతమంది అడగటం జరిగింది. అయితే తనకు ఇష్టం లేదంటూ కొట్టి పారేస్తూ వచ్చారు. కానీ ఈ సారి తను నటించబోయే పాత్ర కోసం వేరే వారిని ట్రై చేసి…వారి నుంచి తనకు నచ్చిన అవుట్ ఫుట్ రాకపోవటంతో తనే నటుడుగా మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆ పాత్ర సక్సెస్ అయితే వర్మ కంటిన్యూ చేస్తారా..వేరే వాళ్ల సినిమా లు చేస్తారా అన్నది చూడాలి. అయితే నటుడుగా వర్మ చేసే తొలి చిత్రం కావటంతో ఖచ్చితంగా బజ్ ఉంటుందని ట్రేడ్ భావిస్తోంది.