TV9 రవి ప్రకాశ్ కొత్త చానల్ వెనుక వాళ్లేనా?
రకరకాల పరిణామాలతో,వివాదాలతో, కేసులతో టీవీ9 ఛానల్ నుండి బయటకు వచ్చినటువంటి మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్పుడు తన ప్రస్దానాన్ని మరోసారి మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం మేరకు ఆయన ఓ కొత్త టీవీ ఛానెల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఆయన పెట్టబోయే ఛానెల్ పేరు టీవీ 36 అని తెలుస్తోంది. ఈ మేరకు తెర వెనక ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తన అనుభవాన్ని, పరిచయాలను ఉపయోగించి ఈ కొత్త న్యూస్ ఛానెల్ ని జనాల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.
ఇక ఒకప్పటి టీవి9 జర్నలిస్ట్ జకీర్ ఫేస్ బుక్ లైవ్ పెడుతూ ఈ ఛానెల్ గురించి మాట్లాడారు. ఈ లైవ్ సుదీర్గంగా సాగింది. ఆ లైవ్ విన్నవాళ్లకి రవిప్రకాష్ తో జకీర్ టచ్ లో ఉన్నారని , ఆయన మాట మేరకే లైవ్ లోకి వచ్చి విశేషాలు వెల్లడించినట్లుగా అనిపిస్తోంది. ఛానెల్ ఎలా ఉండబోతోంది. రవిప్రకాష్ ఆలోచనలు, కార్యాచరణ ఎలా ఉన్నాయి, ఇవన్నీ జకీర్ తనకు అందిన సమాచారం అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
తెలంగాణాలో బలమైన మీడియా అవసరం అని, యాంటీ కేసీఆర్, యాంటీ టీఆర్ ఎస్ మీడియా సంస్ద నడిపేలా ఈ కృషి జరుగుతున్నట్లు మీడియా వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అలాగే ఈ కొత్త ఛానెల్ వెనక బలమైన పునాది ఉందని, బీజేపీ నేతల అండతోనే ఈ ఛానెల్ ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్తున్నారు.
ఇంత ఇబ్బందుల్లోనూ తనను వీడని మీడియా సన్నిహితులు కొందరితో ఈ ఛానెల్ ప్రారంభం అయ్యే అవకాసం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఆర్దికంగా ఏ ఇబ్బంది లేదని, ఇప్పుడు ఆ ఛానెల్ ని జనాల్లోకి తీసుకెళ్లటం ఎలా అనేదే పెద్ద టాస్క్ అని చెప్పుకుంటున్నారు. టీవి 9లో బిజీపీ మీదా, మోడీ కు వ్యతిరేకంగా కథనాలు రాసి, శబరిమలై ఎపిసోడ్ ని హైలెట్ చేసిన ఆయన ఇప్పుడు అదే బిజీపీ అండంతో మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వటం మాత్రం చెప్పుకోదగ్గ విషయమే.
రీసెంట్ గా రవిప్రకాష్ ఇచ్చిన ఇంటర్వూలో … ఇప్పటికీ టీవీ9 ఛానల్‌లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఒకవేళ వీలుపడని పక్షంలో మరో ఛానల్ ప్రారంభించి, మొదటి నుంచి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. కాబట్టి త్వరలో మనం ఓ కొత్త టీవి ఛానెల్ ని చూడబోతున్నాం అన్నమాట.