టాలీవుడ్‌కి మరో కొత్త బ్యూటీ!

టాలీవుడ్ కొత్త భామ‌ల‌కు ఎప్పుడూ స్వాగ‌తం ప‌లుకుతూ వుంటుంది. తెలుగు వాళ్ల‌కంటే ఈ మ‌ధ్య కాలంలో బ‌య‌టి వాళ్లే ఇక్క‌డ స్టార్‌లుగా వెలుగొందుతున్నారు. మ‌ల‌యాళ‌, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల నుంచి వ‌చ్చిన వారిదే ఇక్క‌డ హ‌వా న‌డుస్తోంది. తాజాగా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కొత్త సుంద‌రి కాశీమా ర‌ఫీ ఎంట‌రివ్వ‌బోతోంది. త‌మిళంలో `కాదంబ‌రి`, క‌న్న‌డలో `ఝ‌న్ జ‌నా ఝ‌న్` చిత్రాల్లో న‌టించింది. ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ద్వారా తెరంగేట్రం చేయ‌బోతోంది.

యంగ్ డైరెక్టర్ గ‌నుకుంట్ల ర‌మేష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల‌ `దాదా సాహెబ్ ఫాల్కే` అవార్డుల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌క్షిణాది తార‌లంతా హాజ‌రై సంద‌డి చేశారు. ఇదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కాశిమా ర‌ఫీని చూసిన ద‌ర్శ‌కుడు గ‌నుకుంట్ల రమేష్ త‌న తాజా చిత్రం కోసం ఎంపిక చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని కాశీమా వెల్ల‌డించింది. ` దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నేనూ ఓ భాగం కాబోతున్నందుకు ఆనందంగా వుంది. ఈ చిత్రంలో కాలేజీ అమ్మాయిగా న‌టించ‌బోతున్నాను. గ‌త చిత్రాల‌కు మించి ఈ చిత్రం నాకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంద‌ని భావిస్తున్నాను. అని చెప్పుకొచ్చింది.