ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిపోయిన తర్వాత కూడా వైసీపీ పార్టీ లోపల కలకలం కొనసాగుతోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎటూ తేలక పోతున్న ఈ పార్టీ… ఇప్పుడో మళ్లీ పాత వ్యవహారాల మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. గతంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన నేతలపై తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి కీలక కార్పొరేషన్లు వైసీపీ నుంచి కోలిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గుంటూరులో మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసి టీడీపీలో చేరిన తరువాత పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కానీ అప్పట్లో స్పందించని వైసీపీ ఇప్పుడు ఆయనతో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదంతా జరిగి నెలలు కావస్తుండగా… ఒక్క అంబటి రాంబాబు తప్ప ఎవ్వరూ పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.
ఇంత ఆలస్యంగా చర్యలు తీసుకోవడమే కాకుండా… పార్టీలో చేరిన మిగిలిన వారిని పక్కన పెట్టి కేవలం ముగ్గురిపైనే వేటు వేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ చర్యలు ఎంతవరకు ప్రామాణికంగా ఉంటాయన్నదానిపైనా పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి దశలో ఈ నిర్ణయం వల్ల పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉంటుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇక కుప్పం నియోజకవర్గంలోనూ వైసీపీ అదే తరహాలో చర్యలు తీసుకుంది. మునిసిపాలిటీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు ఆరోపిస్తూ 10 మంది కౌన్సిలర్లతో పాటు మరో ఆరుగురిపై సస్పెన్షన్ విధించింది. మొత్తంగా 16 మందిపై వైసీపీ వేటు పడింది. అయితే ఇప్పటికే ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత ఈ చర్యలు తీసుకోవడాన్ని చూసి, పలు చమత్కారాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.