వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా రాజకీయాల్లో ప్రవేశించి 2009 లో లోక్ సభకు ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి జీవితం అనేక రకాల మలుపులు తిరుగుతూ, చిన్న వయసులోనే ఎగుడుదిగ్గుళ్లకు లోనై, కష్టాలు, కడగండ్లు లాంటి అనేక వైతరణి నదులను దాటుకుంటూ ఈరోజు అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే జగన్మోహన్ రెడ్డి జీవితం యువతరానికి ఆదర్శంగా నిలుస్తుంది.
పుట్టుకతో కోటీశ్వరుడుగా, రాజకుటుంబం, విద్యావంతుల కుటుంబం అనదగ్గ పెద్ద కుటుంబంలో జన్మించి, చిన్న వయసులోనే పారిశ్రామికవేత్తగా జీవితాన్ని గడిపిన ఆయన తండ్రి గారి హఠాన్మరణంతో విధిలిఖితం ఎంత భయంకరంగా ఉంటుందో చూడాల్సి వచ్చింది. కేవలం తనను ధిక్కరించిన అపరాధానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబి ఆజాద్, చిదంబరం…వారితో కుమ్మక్కయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలిసి కట్టగట్టుకుని సాహసంతో పద్మవ్యూహంలో చొరబడిన అభిమన్యుని దుష్ట కౌరవులు ఏవిధంగా వెన్నుపోటు పొడిచి హత్య చేశారో అదే విధంగా నిండా నలభై ఏళ్ళు కూడా లేని…రాజకీయాల్లో నెలల పసిగుడ్డు అయిన జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, భవిష్యత్తును సర్వనాశనం చెయ్యాలని వ్యవస్థలను అడ్డు పెట్టుకుని చెయ్యని కుటిల ప్రయత్నాలు, కుట్రలు లేవు.
ఎవరెంత వేధించినా, బోనులో బంధించినా, ఏమాత్రం తలవంచక….ప్రత్యర్థుల ముందు తలవంచేకన్నా, తలను ఉత్తరించుకోవడమే ఆత్మగౌరవమని నమ్మి రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, పచ్చ మీడియాతో ఒంటరిపోరాటం చేసాడు. మొదటి దఫా ఎన్నికల్లో పరాజయం పలకరించినా ఏమాత్రం కృంగిపోకుండా ప్రజలను నమ్ముకుని పాదయాత్రకు శ్రీకారం చుట్టారు జగన్. ఆరు మాసాలలో ముగించాలనుకున్న పాదయాత్ర సుమారు పదిహేను నెలల పాటు సాగింది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలను సైతం జగన్ అడుగులు పునీతం చేశాయి.
ప్రజల కష్టాలను కళ్లారా చూసిన జగన్మోహన్ రెడ్డి తన కర్తవ్యమ్ ఏమిటో నిర్ణయించుకున్నాడు. ఫలితంగా “నవరత్నాలు” అనే ఒక విశిష్ట పధకం పురుడుపోసుకుంది. అదే వైసిపి పాలిటి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అయింది. ఆ కార్యక్రమాలు అమలు చేస్తే చాలు రాష్ట్రం కన్నీరు తుడిచినట్లే అన్న విశ్వాసం జగన్మోహన్ రెడ్డిలో కలిగింది. జగన్ నవరత్నాలను, వ్యక్తిగత విశ్వసనీయతను జనం నమ్మారు. వారి నమ్మకం కల్కి చేతుల్లో ఖడ్గంలా వీరవిహారం చేసి జగన్మోహన్ రెడ్డిని వేధించిన తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ మొత్తం రాష్ట్రంలో కకావికలైపోయాయి. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా తెలుగుదేశం పార్టీ నామమాత్రావశిష్టంగా మిగిలింది. చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయుడు మంత్రి హోదాలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పోటీ చేసి కూడా ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు జీవితంలో కనీవినీ ఎరుగని పరాభవాన్ని మోయాల్సి వచ్చింది. జీవితాంతం కుమిలికుమిలి ఏడ్వాల్సిన రీతిలో ప్రజలు వారికి శాస్తి చేశారు.
అధికారం చేపట్టిన మరుక్షణమ్ నుంచే జగన్ తన కార్యాచరణను ప్రారంభించారు. పరిపాలనకు కొత్త అయినప్పటికీ ఏమాత్రం తడబడలేదు. మంత్రివర్గం, అధికార యంత్రాంగం మీద విశేషమైన పట్టును సాధించారు. తన మనసులోని ప్రజారంజక పధకాలను శరవేగంగా అమలు చెయ్యడం ప్రారంభించారు. ఆ ఫలితమే కేవలం ఏడాదిన్నర కాలంలో నూటికి పైగా పధకాలను అమలు చేసారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని, దూకుడును ప్రదర్శించారు. దాదాపు లక్షకోట్ల రూపాయల విలువగల సంక్షేమ పధకాలను అమలు చేసారు.
నాలుగు లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. యాభైవేలమంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. వెయ్యి రూపాయల ఖర్చు దాటే వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఫీజ్ రీయింబర్స్మెంట్, పింఛన్లు, రైతులకు ఉచిత బోర్లు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, బీసీ కార్పొరేషన్లు, నలభై నాలుగు లక్షలమంది విద్యార్థులకు విద్యాకానుక, ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, మహిళలకోసం అభయం పధకం, జగనన్న జీవక్రాంతి…..ఇలా ఒకటా రెండా…..వందలాది పధకాలు, వేలకోట్ల రూపాయలు పీడిత ప్రజలకోసం వెచ్చించడం భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమయిన వింత. ఎలా తెస్తున్నారు ఇన్ని వేలకోట్లు అని ప్రశ్నిస్తే అది అవివేకమే అవుతుంది. “మనసుంటే మార్గం ఉంటుంది” అని పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ మనసు లేకపోతె కోట్ల రూపాయలు బీరువాలో ఉన్నా గడ్డిమోపుతో సమానం అవుతుంది. అలాంటి మనసు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కాబట్టే ఆయన భారతదేశంలోని మూడో ఉత్తమ ముఖ్యమంత్రిగా పరిగణించబడుతున్నాడు.
ఇక ఆయనకు తెలుగుదేశం పార్టీ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నది. వ్యవస్థల ద్వారా ఆయనకు బ్రేకులు వెయ్యాలని నానాపాట్లు పడుతున్నది. ఎంతో విలువైన సంస్కరణలు జగన్ తీసుకుని రావాలని ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డుకుంటున్నది. తద్వారా తెలుగుదేశం తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నది. వారి ఖర్మకు ఎవరేమి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాజధాని వికేంద్రీకరణ ఆచరణలోకి వస్తే రాష్ట్రం లోని అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
సాహసానికి, ధైర్యానికి, సద్గుణాలకు, సంస్కారానికి అర్ధం చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు.
యువశక్తి అనేది ఎలా జ్వలించాలి అంటే జగన్మోహన్ రెడ్డిలా అని చెప్పొచ్చు.
పరిపాలన అనేది ఎలా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలా అని చెప్పొచ్చు
పులి కడుపున పులి పుడుతుంది అనే సామెతకు అర్ధం అడిగితే జగన్మోహన్ రెడ్డిని చూపించవచ్చు.
శ్రీ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా “తెలుగురాజ్యం” వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. పదికాలాలపాటు ఈ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిగా, ప్రజలకు దిక్సూచిగా, మార్గదర్శిగా యశస్సు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
YS Jagan Birthday special article from TeluguRajyam