హైదరాబాద్: ” అమరావతిలో రాజధాని పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఆ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. పనులు ఆగిపోయాయి” అని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజా డైలాగ్. అమరావతిలో శాశ్వత భవనాలు లేవని, అవి నమూనా భవనాలేనని నిపుణులు చెబుతున్నారు. అవి వాన కురిస్తే ఆపలేని భవనాలని ప్రభుత్వ ముఖ్యులు కూడా అనేక సందర్భాలలో చెప్పారు. అది అమరావతి కాదు, భ్రమరావతి అని అనేక మంది అభిప్రాయపడ్డారు.
2019 లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రాజధాని పనులు ఆకస్మికంగా ఆగిపోయాయని యనమల అంటున్నారు. ఆ ఎన్నికలు ఆకస్మికంగా వచ్చాయా? అవి అయిదేళ్ల షెడ్యూలు తర్వాత వచ్చిన ఎన్నికలే కదా? అవి రాజకీయ సంక్షోభంలో మధ్యంతరంగా వచ్చిన ఎన్నికలు కావు కదా! అవి ఉప్పెనలా చెప్పాపెట్టకుండా వచ్చిన ఎన్నికలా? పోనీ ఎన్నికల సమయంలో అమరావతి ఖర్చుల గురించి ప్రజలకు వివరించి చెప్పారా?
లోపించిన విశ్వసనీయత
అమరావతి గురించి గానీ, మూడు రాజధానుల గురించి గానీ యనమల చేస్తున్న ప్రకటనల్లో ఏ మాత్రం విశ్వసనీయత కన్పించడం లేదు. మూడు రాజధానులు పెట్టడం సాధ్యం కాదని, అందుకు విభజన చట్టానికి పార్లమెంటులో సవరణ అవసరమని కొన్ని రోజుల క్రితం న్యాయ కోవిదుడిలా వ్యాఖ్యానించిన ఆయన కేంద్ర హోమ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు “ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం” అని లిఖిత పూర్వకంగా స్పష్టం చేయడంతో యనమల నోరు మూశారు. ఆ విషయం మళ్ళీ ప్రస్తావించడం లేదు. యనమల మాటను నమ్మి, వైఎస్సార్ సిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇంకా చట్ట సవరణ గురించి కోరస్ పాడుతున్నారు. యనమల ఆపేసిన పాటను రాజు గారు ఆలస్యంగా అందుకున్నారు.
Also Read – రెండింటికి చెడిన రేవడి చందంగా జన సేనాని పవన్ కళ్యాణ్
అమరావతి నిర్మాణ ఆర్ధిక లెక్కలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఈ అంకెల గారడీని నమ్మని హైకోర్టు…. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను కేంద్రం ఇచ్చిన నిధుల మీద, రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బు మీద ఇటీవలనే నివేదిక కోరింది. అమరావతి నిర్మాణం సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు ముందు ముందు అనేక విషయాలకు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే ముందు ఆయన అందుకు సిద్ధం కావలసి ఉంటుంది. ఎటువంటి ముఖ్య నిర్ణయాలకైనా మంత్రి వర్గం ఉమ్మడి బాధ్యత ఉంటుంది. ఆ విధంగా అప్పటి సీఎం చంద్రబాబు పైన, తోటి మంత్రులపైనా నింద మోపి యనమల తప్పించుకోవచ్చు. కానీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్దిష్టంగా ఆర్ధిక శాఖ మీద చేసే అభియోగాల నుంచి యనమల ఎలా తప్పించుకోగలరు? అమరావతి నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన నిధులకు తెలుగుదేశం ప్రభుత్వం సరిగా లెక్కలు చెప్పడం లేదని స్వయంగా ప్రధాన మంత్రి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ లెక్కల చిక్కులు త్వరలో విడిపోనున్నాయి.
—శాంతారామ్