మెగా ఫ్యామిలీ నుంచి అరడజను మంది హీరోలు వచ్చారు. చిరంజీవి స్టార్‌డమ్ నీడన హీరోలుగా కొంతమంది ఎదిగారు. తమకంటూ స్వంత స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. కొందరు ఎదుగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ కాలేదు కాని ‘చిరు చెట్టు నీడ ఇంకొకడు వస్తున్నాడ్రా’ అని కామెంట్స్ చేశారు. అదే ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఒక అమ్మాయి వస్తుందని తెలియగానే సర్‌ప్రైజ్ అయ్యారు. అంతకు మించి షాక్ అయ్యారు. ఎందుకంటే… హీరోయిన్ల గురించి మెజారిటీ ప్రేక్షకుల్లో ఎటువంటి అభిప్రాయం వుందో అందరికీ తెలిసిందే. అయితే.. మెగా డాటర్ నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ ప్లాప్ అయ్యింది. దాంతో చాలామంది ఆమెను హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు. ఎక్కువకాలం నటిగా కొనసాగడం కష్టమని తేల్చేశారు. నిహారికకూ ఎక్కువ రోజులు సినిమాలు చేసే ఉద్దేశం లేదు. శనివారం ‘హ్యాపీ వెడ్డింగ్’ విడుదల కానున్న సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన నిహారిక ఈ సంగతి వెల్లడించారు.
‘స్టార్ హీరోలతో సినిమాలు చేయడం లేదు. చిన్న చిన్న హీరోల చేస్తున్నారు? ప్రత్యేక కారణాలు ఏమైనా వున్నాయా?’ అని నిహారికను ప్రశ్నిస్తే… “ఇండస్ట్రీలో ఎక్కువరోజులు, సంవత్సరాలు సినిమాలు చేయాలని లేదు. పది పదిహేనేళ్ల పాటు నటించాలనే కోరికలు ఏం లేవు. మూడు నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఈలోపు మంచి సినిమాలు చేయాలని నాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటున్నా” అన్నారు. అదండీ సంగతి!! మరి, ఆ తరవాత ఏం చేస్తారు? అంటే “ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటా. వెబ్ సిరీస్‌లు చేస్తా. అందుకని, ఇప్పుడు హీరో ఎవరనేది ఆలోచించడం లేదు. జస్ట్ కథ నచ్చితే చేస్తున్నా. స్టార్ హీరోల సినిమాల్లో నటించనని కాదు, అవకాశం వస్తే నటిస్తా. ఇప్పటివరకూ నాకు స్టార్ హీరోలు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు” అని అసలు సంగతి చెప్పారు.