డిసెంబర్‌లో మమతా బెనర్జీ అరెస్ట్: బీజేపీ నేత సంచలన జోస్యం.

డిసెంబర్‌లో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందిట. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరెస్టవుతారట. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విచ్చిన్నమైపోతుందట. ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమట. అలాగని వెస్ట్ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే అగ్ని మిత్ర పాల్ సంలచన జోస్యం చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చాలా ఏళ్ళుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. బెంగాల్‌లో గవర్నర్‌గిరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్నీ రంగంలోకి దించి, మమతా బెనర్జీని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయి, జరుగుతూనే వున్నాయి. మొన్నామధ్య జరిగిన బెంగాల్ ఎన్నికల సమయంలో, తృణమూల్ నుంచి పెద్దయెత్తున నాయకుల్ని బీజేపీ లాగేసింది. మమతా బెనర్జీని అయితే ఓడించిందిగానీ, మమతా బెనర్జీ నుంచి అధికారాన్ని దూరం చేయలేకపోయింది బీజేపీ. నిజానికి బీజేపీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు కాదు. అలా తయారైంది దేశంలో పరిస్థితి.

ఇంతకీ, డిసెంబర్‌లో మమతా బెనర్జీ అరెస్టవుడు ఖాయమేనా.? అంటే, అవకాశాలైతే ఎక్కువగానే వున్నాయి. పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఢిల్లీ.. ఈ మూడిటిపైనా బీజేపీ అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సహా పలు కేసులకు సంబంధించి ఈ మూడు రాష్ట్రాల్లోని అధికార పార్టీలపై పెద్దయెత్తున ఆరోపణలు చేస్తోంది బీజేపీ. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే దర్యాప్తు సంస్థల్ని కూడా ఉసిగొల్పుతున్న వైనం కనిపిస్తోంది.

సో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బీజేపీ ఈసారి ఇంకాస్త గట్టిగా ఇరకాటంలో పడే అవకాశం లేకపోలేదు.