ఈ తెలంగాణ డాక్టర్ మగాడ్రా బుజ్జీ

ప్రభుత్వ డాక్టర్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది వాళ్లు కసురుకుంటరు.. బాగా చూడరు. కనీసం చెయ్యి పట్టుకుని కూడా చూడరు. మనం ఇటు చెప్తుంటే అటు చూసుకుంట మందులు రాస్తరు.. ఇదేగదా? మనలో ఎక్కువ మందికి ఉన్న అనుభవం. గవర్నమెంట్ డాక్టర్ల దగ్గరికి పోయే బదులు డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుని ప్రైవేటు డాక్టర్ దగ్గరికి పోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఊళ్లల్ల దగ్గర పట్ల సర్కారు దవాఖానా ఉన్నా కూడా వారు పోరు. అవసరమైతే ఊళ్ల ఉన్న ఆర్ ఎంపీల దగ్గర చూపించుకుంటరు. పెద్దాసుపత్రికి పోయేందుకు కూడా ఇష్టపడరు. కానీ ఈ గవర్నమెంట్ డాక్టర్ అసోంటోడు కాదు. నిఖార్సైన డాక్టర్. ఈయన ఇప్పుడు పనిచేస్తున్న ఊరోళ్లకు దేవుడు. గిరిజన జాతిలో పుట్టిన రత్నం ఈ డాక్టర్. డాక్టర్లలో దేవుడు ఉండు అంటారు కానీ చాలా మంది డాక్టర్లలో డబ్బు గుంజే దెయ్యాలే కనబడతాయి. ఈ డాక్టర్ మాత్రం నిజంగా దేవుడే అంటున్నారు ఖమ్మం జిల్లాలోని ఈ ఊరి జనాలు.

మా టీచర్ మాకు కావాలని ఏడ్చిన విద్యార్ధులను చూశాం, మా కలెక్టర్ మాకు కావాలని కొట్లాడిన ప్రజలను చూశాం, ఈ ఎస్పీని బదిలీ చేయొద్దని జనాలు రోడ్లెక్కిన సంఘటనలు చూశాం. కానీ మా డాక్టర్ మాకు కావాలని కొట్లాడినోళ్లు మాత్రం తక్కువ. ఈ ఊరోళ్లు మాత్రం మా డాక్టర్ మాకు రావాలె అని పోరాడుతున్నరు. ఈ ఊరి ప్రజల హృదయాలను గెలుచుకున్న ఖమ్మం జిల్లా డాక్టర్ నాయక్ కథేంటో మీరే చదవండి.

 

ఈ డాక్టర్ పేరు బాలాజీ నాయక్. కాంట్రాక్టు పద్ధతిలో ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరి పేట గ్రామ వైద్యశాలలో గత రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఇతడు గ్రామానికి వచ్చినప్పుడు కొంత మంది రోగులు మాత్రమే ప్రభుత్వ దవాఖానకు వచ్చేవారు. ఈ డాక్టర్ ప్రభుత్వ వైద్యశాలలో మంచి వైద్యం అందుతది.. అందరూ ఇక్కడికే రాండి అని చెప్పినా మొదట్లో ప్రజలెవ్వరూ పట్టించుకోలేదు. కొంత కాలంలోనే తన వైద్యం తీరుతో ప్రజల అభిమానాన్ని పొందారు. ఇప్పుడు ఈ ఊరిలో ఏ జబ్బు వచ్చినా డాక్టర్ బాలాజీ నాయక్ వద్దకే పోతున్నారు జనాలు. ప్రయివేటు దావాఖానాకు పోయేవారే ఈ ఊరిలో లేరంటే ఆశ్చర్యం కలగకమానదు.

 

….అది 2016 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు కాలం. ఖమ్మం జిల్లాలో ఈ నాలుగు నెలల్లో తీవ్రమైన డెంగ్యూ వ్యాదులు వచ్చాయి. ప్రత్యేకించి బోనకల్ అనే మండలం ఆ ఏడాదికి దేశంలోనే అత్యధిక డెంగ్యూ వ్యాధిగ్రస్థుల మండలంగా రికార్డు నెలకొల్పింది. బొనకల్ మండలంలో 20 గ్రామాలుంటే అందులో 10 గ్రామాల్లో డెంగ్యూ వ్యాధి సోకింది. గ్రామస్తులను పరీక్షిస్తే సుమారు 500 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. ఈ సమయంలో డాక్టర్ బాలాజీ నాయక్ బొనకల్ మండల పిహెచ్ సి డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ నాలుగు నెలల పాటు డాక్టర్ బాలాజీ నాయక్ రాత్రింబవళ్లు పనిచేశారు. డెంగ్యూ వచ్చిన వారందరికీ పిహెచ్ సిలో అడ్మిట్ చేసుకుని వైద్యం చేస్తూనే మరోవైపు గ్రామాల్లో డ్రై డే గా పాటించేలా జనాలను సన్నద్ధం చేశారు. ప్రివెంటివ్ మెథడ్స్ చేపట్టారు. ఇంటింటికీ తిరిగి ఇండ్లల్లో నీటి నిల్వలు లేకుండా నీరు పారబోయించారు. అప్పుడు డాక్టర్ బాలాజీ నాయక్ మీద నమ్మకంతో రోగుల్లో 90 శాతం మంది బొనకల్ పిహెచ్ సిలోనే వైద్యం చేయించుకున్నారు. ఒక పది శాతం మంది మాత్రమే ప్రయివేటు ఆసుపత్రులకు వైద్యం కోసం వెళ్లారు. నాలుగు నెలలు విరామమెరుగక పనిచేసి డెంగ్యూ ని నివారించగలిగారు డాక్టర్ బాలాజీ నాయక్. జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కొండల్ రావు సహకారం, ఆయన ప్రోత్సాహంతోనే తాను కష్ట పడి పని చేశానని డాక్టర్ బాలాజీ తెలుగు రాజ్యం తో మాట్లాడుతూ నాటి సేవలను గుర్తు చేసుకున్నారు. తదుపరి ఏడాది 2017లో డాక్టర్ బాలాజీ నాయక్ కు ఉత్తమ డాక్టర్ గా అవార్డు దక్కింది.

 

 

తన గురించి డాక్టర్ బాలాజీ నాయక్ ఏమంటున్నారంటే..
మాది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా. నేను 2006 నుంచి 2012 వరకు గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివాను. మొదటి పోస్టింగ్ 2012 లో కోపెనగడప పీహెచ్ సీలో తీసుకున్నాను . అక్కడ ఏడాదిన్నర పనిచేశాను. 2014 లో బోనకల్ పీహెచ్ సీకి బదిలీపై వచ్చాను. ఆ తర్వాత 2016 అక్టోబర్ నుంచి మాటూరిపేట పీహెచ్ సీకి బదిలీపై వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాటూరిపేట ప్రభుత్వాసుపత్రిలోనే పనిచేస్తున్నాను. ప్రభుత్వం జరిపిన వైద్యనియామకాల్లో నాకు రెగ్యూలర్ డాక్టర్ గా ఉద్యోగం రావడంతో భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం ఆస్పత్రికి నియమించారు. ఆర్డర్స్ వచ్చినా మాటూరిపేట గ్రామస్థుల వినతి మేరకు డిఎంహెచ్ వో కొండల్ రావు గారు ఇక్కడే కొనసాగమన్నారు. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రామస్థులు వైద్యశాఖ మంత్రికి లేఖ రాశారని తెలిసి షాక్ అయ్యాను. అడవుల జిల్లా అయినందున ఖమ్మం జిల్లాలో గిరిజనులే అధికంగా ఉంటారు. వర్షా కాలం వచ్చిందటే అటవీ పరిసర గ్రామాలలో అధికంగా డెంగ్యూ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. నేను బొనకల్ లో పనిచేసిన సమయంలో డిఎంహెచ్ వో సహకారంతో రోగులకు చికిత్స చేయగలిగాను. ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేకుండా కాపాడగలిగాను. నిజంగా ఇది నా కెరీర్ లో మరిచిపోలేని విషయం.


కాంట్రాక్టు బేస్డ్ డాక్టర్ గా ఉన్న బాలాజీకి రెగ్యులర్ పోస్టింగ్ వచ్చింది. ఇటీవల జరిగిన వైద్య నియామాకాల్లో బాలాజీకి రెగ్యూలర్ వైద్యునిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో పోస్టింగ్ ఇచ్చింది. ఊరి డాక్టర్ రేపో మాపో బదిలీపై పోతాడని తెలుసుకున్న గ్రామస్థులంతా మా డాక్టర్ మాకే ఉండాలి. డాక్టర్ బదిలీని నిలిపివేయాలని ఏకంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాశారు. డాక్టర్ బాలాజీ నాయక్ వచ్చినంక మేము సంతోషంగా ఉన్నామని గ్రామస్థులు అంటున్నారు. ఏం చేసైనా సరే డాక్టర్ ను కదలనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. గత ఏడాది విష జ్వరాలు వచ్చినప్పుడు బాలాజీ నాయక్ వైద్యం కారణంగా తమ గ్రామంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్థులు లేఖలో పేర్కొన్నారు. గ్రామస్థులు మూకుమ్మడిగా రాసిన లేఖను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బదిలి నిలిపివేసే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

చూశారు కదా ఎంత మంది ఇటువంటి డాక్టర్లు ఉంటారు చెప్పండి. రోగం వచ్చి ఆసుపత్రికి పోతే ప్రాణం తోటి మళ్లీ ఇంటికి తిరిగొస్తామో లేదో అనుకుంటూ బతికే ఈ రోజుల్లో ప్రజల కోసం పనిచే డాక్టర్ ఉండటం గొప్పే కదా అంటున్నారు జనాలు. అందుకే అటువంటి డాక్టర్ ను వదులుకోలేక వారు తమ డాక్టర్ కోసం పోరాడుతున్నారు. డబ్బు కోసమే కక్కుర్తి పడే డాక్టర్లు వందలు, వేల సంఖ్యలో ఉన్న ఈ రోజుల్లో జనాలకు సేవ చేయడమే నిజమైన డాక్టర్ గిరీ అని తన పని తాను చేసుకుంటూ పోతున్న బాలాజీ నాయక్ తీరును అందరూ అభినందిస్తున్నారు.

మాటూరి పేట గ్రామస్థులు మంత్రికి రాసిన లేఖ ఇదే