రాజకీయాల్లో భిన్న మార్గాలు ఎంచుకుని చివరికి సన్యాసం ప్రకటించిన మాజీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత, సాయిరెడ్డి ఏ పార్టీకి వెళ్లబోతున్నారన్న చర్చ ఇప్పటికే మొదలైపోయింది. తాజా సమాచారం ప్రకారం, ఆయన బీజేపీలోకి అడుగుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ మార్గంలో ఇద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిన అవసరం ఉంది.. వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎంపీ సీఎం రమేశ్.
ఇటీవలి కాలంలో సాయిరెడ్డిని చుట్టుముట్టిన లిక్కర్ స్కాం, కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసుల మధ్య ఆయన రాజకీయంగా సేఫ్‌జోన్ వెతుకుతున్నట్లు భావిస్తున్నారు. బీజేపీ చేరితే కేంద్రంలో ఉన్న పార్టీకి చేరినట్టవుతుంది కాబట్టి, అది సేఫ్ అవుతుందనే నమ్మకం సాయిరెడ్డిలో ఉంది. అందుకే ముందుగానే ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే అతనిని పార్టీలోకి చేర్చే విషయంలో పురందేశ్వరి, రమేశ్ అంగీకారం ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది.
పురందేశ్వరిని ఒప్పించేందుకు సాయిరెడ్డి తన స్నేహితుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బంధుత్వం, పాత పరిచయాలపై ఆశలు పెట్టుకున్న సాయిరెడ్డి, ఇదే ఆయుధంగా ఆమెను మెప్పించాలనుకుంటున్నారు. మరోవైపు, జగన్ అనుచరుడిగా పేరున్న సాయిరెడ్డిని రమేశ్ మాత్రం పార్టీలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.
వ్యాపారంలో ఎదిగి రాజకీయాల్లో పట్టు సంపాదించిన రమేశ్‌కు పార్టీ అధిష్ఠానంలో మంచి ప్రభావం ఉండటంతో ఆయనకు అనుమతి లేకుండా ఈ వ్యవహారం ముందుకెళ్లడం కష్టమే. ఇప్పుడు బీజేపీలోకి ఎంట్రీపై సాయిరెడ్డి ఆశలు కొనసాగుతుండగా, తలుపులు తెరుచుకోవాలంటే పురందేశ్వరి–రమేశ్ ద్వయం ఓకే చెప్పాల్సిందే. ఇక వీరి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్న సాయిరెడ్డి వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. కానీ ఆయన బీజేపీకి చేరే దారిలో రాజకీయంగా సాఫీగా లేదు అనడం ఖాయం.


