Vangaveeti Ranga Daughter: ఈ నెల 26వ తేదీన దివంగత నేత, వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా… విశాఖపట్నం వెదికగా ‘రంగనాడు’ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమయంలో బడుగు, బలహీన వర్గాలకోసం పాటుపడిన వ్యక్తిగా వ్యక్తి అయిన రంగా కోసం పార్టీలకు, కులమతాలకు అతీతంగా పెద్దలు, ప్రజలు హాజరయ్యారు! ఈ సందర్భంగా జిల్లాకు వంగవీటి రంగా పేరు అనే అంశం తెరపైకి రావడంతో.. పలు ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.
వంగవీటి రంగాకు పూర్తిగా వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉందని అంటున్న సమయంలో జిల్లాకు రంగా పేరు అనేది జరిగే పనేనా..?
పార్టీలకు అతీతంగా అన్నట్లు జగన్ తన హయాంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పెరు పెట్టినట్లుగా.. టీడీపీ హయాంలో రంగా పేరు జిల్లాకు పెట్టే అవకాశం అస్సలు ఉందా..?
రంగా ఫోటోను ప్రచారాలకు మాత్రమే వాడుకుంటున్నారని.. ఆయన ఆశయాలను విస్మరిస్తున్నారనే ఆశాకిరణ్ కామెంట్లు పవన్ కూ ఏ మేరకు తగిలి ఉంటాయి..?

వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. ఇందులో భాగంగా… 37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు..? అంటూ నిలదీసిన ఆశా కిరణ్.. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు.. ఆ తర్వాత ఆయన పేరును, ఆయన ఆశయాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
తన తండ్రి పేదల కోసం జీవించారని.. వారి కోసమే ప్రాణత్యాగం చేశారని.. ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రజల్లోకి వస్తున్నానని.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీలు, విద్యార్థులను కలిసి రాధా రంగా మిత్రమండలిని మరింత బలోపేతం చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన తండ్రి ఫొటో పెట్టుకొని గెలిచిన నాయకులు తమకేం న్యాయం చేశారని ఆమె సూటిగా ప్రశ్నించారు!
ఈ నేపథ్యంలో ప్రధానంగా… జిల్లాకు తన తండ్రి పేరు అనే అంశాన్ని ఆమె ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అందుకు ఆయనకు పూర్తి అర్హత ఉంది అనే కామెంట్ల నడుమ… ఇప్పటివరకూ రాజకీయాల్లో ఉన్న రాధా ఈ మేరకు చేసిన ప్రయత్నాలూ చర్చకు వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిపై ఈ విషయంలో కీలక బాధ్య్తత ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.

పైగా కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ జిల్లాకు రంగా పేరు పెట్టే విషయంలో రంగా అభిమానులు, కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజానికం చూపంతా పవన్ పైనే ఉందనే చర్చా జరుగుతుంది. అయితే.. కనీసం ఆయన వర్ధంతి నాడు పవన్ నివాళులు అర్పించని విషయాన్ని ఈ సందర్భంగా రంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ఏది ఏమైనా రంగా విషయంలో తెరపైకి వచ్చిన డిమాండ్లు, ఆయన విషయంలో పవన్ వ్యవహార శైలి ఇప్పుడు కాపు సామాజికవర్గంలో అత్యంత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి!

