Ayodhya Special Train: ఏపీ నుంచి అయోధ్యకు వందేభారత్ స్లీపర్: దీపావళికి ముహూర్తం!

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు ఈ దీపావళికి పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. మొదటి దశలో రెండు రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా, తెలుగు రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య/వారణాసికి వందేభారత్ స్లీపర్ కేటాయింపుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది.

రూట్, షెడ్యూల్‌పై తుది కసరత్తు: ఏపీ నుంచి అయోధ్య, వారణాసికి ప్రయాణించే భక్తులు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ స్లీపర్ రైలును కేటాయించాలని ఏపీకి చెందిన కీలక నేతలు రైల్వే మంత్రిని కోరారు. దీనికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత విజయవాడ టు అయోధ్య ప్రతిపాదనకు ఇవ్వాలని రైల్వే శాఖ హామీ ఇచ్చినట్లు సమాచారం. వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తొలి రెండు విడతల్లోనే విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కేటాయింపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ రైలు విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుత రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే అయోధ్యకు కేటాయించేలా తుది కసరత్తు జరుగుతోంది. ఇది రాత్రిపూట నడిచే రైలుగా ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న విశాఖ – సికింద్రాబాద్, కాచిగూడ – యశ్వంత్ పూర్, విజయవాడ – చెన్నై, సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైళ్లకు ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో, ఏపీ నుంచి దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి వందేభారత్ స్లీపర్ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.

దూర ప్రాంతాలకు స్లీపర్ రైళ్ల కేటాయింపు కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు సమర్పించారు. ముఖ్యంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని కోరారు. అయితే, అయోధ్య, వారణాసికి వెళ్లాలనే భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే, అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు ఇది ఒక వరంలా మారుతుందని రాజకీయ, రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Ks Prasad: Balakrishna Comments Creates New Tension In TDP And Janasena | Telugu Rajyam