లిక్కర్ స్కామ్‌లో అరెస్టుకి సిద్ధమైపోతున్న ఎమ్మెల్సీ కవి.?

‘అరెస్టు చేస్తే ఏమవుతుంది.? జైల్లో పెడితే ఏమవుతుంది.? అరెస్టు చేస్తే చేసుకోండి.. జైల్లో పెట్టుకుంటే పెట్టుకోండి..’ అంటూ లైట్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశాన్ని కుదిపేస్తోన్న లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కల్వకుంట్ల పేరు తెరపైకొచ్చింది.. అధికారికంగా. గతంలోనే కవిత అరెస్టవుతారంటూ ప్రచారం జరిగింది. ఈడీ నుంచి ఆమెకు నోటీసులు అందాయని కూడా వార్తలొచ్చాయి. అయితే, అప్పట్లో ఆ వార్తల్ని కవిత ఖండించారు. అయితే, తాజాగా ఓ నిందితుడి అరెస్టు నేపథ్యంలో నిందితుడి రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరుని ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

100 కోట్ల ముడుపులకు సంబంధించి కవితపై ఆరోపణలున్నాయి. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత సుమారు 9 వరకు మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. రెండు సిమ్ కార్డుల్ని కూడా కవిత మార్చారట. ఈ మొత్తం వ్యవహారంపై కవిత స్పందించారు. ఇది రాజకీయ కుట్ర మాత్రమేనని అన్నారు కవిత. ఈడీ కంటే ముందు మోడీ వస్తారనీ.. ఆ తర్వాత ఈడీని పంపిస్తారనీ.. కవిత ఏవేవో సిద్ధాంతాలు చెప్పారు. వ్యవస్థల్ని అధికారంలో వున్నవారు ఎలా వాడతారో కవితకి తెలియదని ఎలా అనుకోగలం.?

గతంలో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డిపైకి కేసీయార్ సర్కారు ఏసీబీని ఉసిగొల్పడంతోనే ఓటుకు నోటు కేసు తెరపైకొచ్చింది. ఒకరు చేస్తే సంసారం.. ఇంకొకరు చేస్తే అది వ్యభిచారం అంటే ఎలా.. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఈడీ ఇంతవరకు కవితకు నోటీసు ఇవ్వలేదు. ఈలోగా ఆమె ఉలిక్కపడ్డారు. అరెస్టు చేస్తే చేసుకోండని కూడా సవాల్ విసురుతున్నారు. ఏమో, ఆ ముచ్చట కూడా ఈడీ తీర్చేస్తుందేమో.!