Mahesh Kumar Goud: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మేనల్లుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు ఏ క్షణంలోనైనా కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎవరికైనా ఉంటుందని, హరీశ్‌రావు విషయంలో గులాబీ బాస్ అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
బీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై మహేశ్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఒకవేళ ఉంటే కవిత ఎందుకు బయటకు వస్తారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ తనకున్న అంగబలంతో, డబ్బుతో సోషల్ మీడియాను మ్యానేజ్ చేస్తూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని, ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

కేబినెట్ విస్తరణ అధిష్టానానిదే.. రాష్ట్రంలో కేబినెట్ ప్రక్షాళనపై కసరత్తు జరుగుతోందని, అయితే దీనిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని, టీపీసీసీ అధ్యక్షుడిగానే తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.
హైదరాబాద్‌పై సీఎంకు స్పష్టమైన విజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై, ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై స్పష్టమైన విజన్ ఉందని కొనియాడారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

