YS Jagan Birthday Special: జగన్ గొప్ప నాయకుడు.. మనస్పూర్తిగా కాదనేవారు చాలా అరుదు! రాజకీయ విభేదాల కోసం విమర్శలు వేరు! కానీ.. ఓ నాయకుడిగా జగన్ ను జనం నమ్ముతారు.. 2024 ఎన్నికల్లో ఘోర ఫలితాల అనంతరం.. కూటమి కొలువుదీరిన ఏడాది లోపే జగన్ ని ఎంతగా నమ్మొచ్చో జనాలకు అర్ధం అయ్యింది! మాట ఇవ్వడం అస్సలు విషయం కాదు.. అధికారంలోకి వచ్చాక, నాలుక మడతపెట్టి, ఇచ్చిన మాటకు కండిషన్స్ పెట్టడం జగన్ కు చేతకాదనే విషయం జనాలు గ్రహించారు. ఈ సమయంలో తాజాగా జగన్ బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలు జగన్ కు పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి.
జగన్.. నిన్ను జనాలు నమ్ముతుంటే.. నువ్వు జనాలను నమ్ముతుంటే.. మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న కొంతమందిని ఈసారైనా పక్కనపెడతావా..?
గత ప్రభుత్వంలో నువ్వు ప్రజలకు చేసిన అన్యాయం ఏమీ లేదు.. కార్యకర్తలను పట్టించుకోని నేరం తప్ప అని ఇప్పటికైనా గ్రహిస్తావా..?
కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, పరిస్థితులు ఏవైనా, పరిణామాలు ఎలాంటివైనా 2024 ఓటమిని మేము మరిచిపోయాం.. 2029 లక్ష్యంగా ముందుకు కదులుతున్నామ్.. అనే కార్యకర్తలకు జగన్ భరోసా ఉన్నట్లేనా..?
పరదాల జగన్ పోయాడు.. నలుగురైదుగురి గుప్పిట్లో నొక్కిపోబడి, బయటకు కనిపించలేకపోయిన జగన్ పోయాడు.. జన్మదినం నాడు సరికొత్త జగన్ ఉద్భవించాడని నమ్మేస్తున్నామని గ్రహించావా..?

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 40శాతం ఓట్లు వచ్చాయి. అక్కడ ముగ్గురూ కలిసినా ఈ పెర్ఫార్మెన్స్ తక్కువ అస్సలు కాదు! పైగా కార్యకర్తలను పట్టించుకోలేదనే ఆగ్రహం ఓ పక్క.. తప్పుడు ఆరోపణలతో ప్రత్యర్థుల ప్రచార మరోపక్క.. అయినా నిలబడ్డాడు! అలా 11 స్థానాలకు పరిమితమై.. మరోపక్క అత్యంత బలంగా అధికార పక్షం కనిపిస్తోంది.
దానికి తోడు కేసులు, అరెస్టులు, బెదిరింపులు, కొట్లాటలు, దాడులు, అత్యాచారలు, హత్యాచారాలు.. అయినా జగన్ పక్క సామాన్య కార్యకర్త నిలబడుతున్నాడు. దీనికి తోడు ఓ పక్క లోకేష్ ఎర్ర బుక్ లో మూడు పేజీలే పూర్తయ్యాయి.. ఇంకా చాలానే ఉన్నాయని అంటున్నాడు.. మరోపక్క పవన్ కాలుకి కాలు మక్కికి మక్కి విరిచేస్తామంటున్నాడు.. అరచేతిలో గీతలు అరగ్గొట్టేస్తానని బెదిరిస్తున్నాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో… అధికారాన్ని కోల్పోయిన 18 నెలల్లోనే , కనీవినీ ఎరుగని రీతిలో జగన్ బర్త్ డే వేడుకల్ని నిర్వహించారు అభిమానులు. గతంలో అధికారం పోయిన 18 నెలల సమయానికి ప్రతిపక్షం మౌనంగా మారిపోయిన పరిస్థితి! ఎవరికి వారు రాష్ట్రాన్ని వదిలిపోయిన పరిస్థితి! కానీ.. ఇప్పుడు లెక్క మారింది. సామాన్యులు మొదలుకుని, ప్రముఖుల వరకూ జగన్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

ఇక్కడ జగన్ చేయాల్సింది చాలానే ఉంది. ఇందులో భాగంగా… తనపై వెల్లువెత్తుతున్న జనాభిమానాన్ని జగన్ గుర్తించాలి. తన చుట్టూ ఉన్న నలుగురైదుగురు కాదు జగన్ అంటే.. తన చుట్టూ ఉన్న భజన బ్యాచ్ కాదు జగన్ అంటే.. జగన్ అంటే లక్షలాది మంది అభిమానం.. ఒక్క పిలుపు ఇస్తే కోటికిపైగా సంతకాలు చేసిన నమ్మకం.. ఈ విషయాన్ని జగన్ ఎప్పటికీ మరిచిపోకూడదు. జగన్ ని కలుసుకోవడం సగటు కార్యకర్తకి అందని ద్రాక్ష కానే కాకూడదు.
ఇక్కడ జగన్ గ్రహించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఎన్నికలకు ఇంకా సుమారు మూడున్నరేళ్ల సమయం ఉంది కదా.. చివరి ఏడాది చూసుకుందాములే అని వైసీపీ కార్యకర్త అనుకోవడం లేదు! ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో నెల నుంచే అన్నీ మరిచిపోయి మళ్లీ జెండా పట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో తెలియని స్థాయిలో మీకు అండగా నిలబడుతున్నాడు. ఇది జగన్ గ్రహించాలి.
నిన్న మీ పక్కన తిరిగిన కొంతమంది పెద్దలు.. ఇప్పుడు పరాయి పంచన సంబరాలు చేసుకుంటున్నరనే స్పృహ జగన్ కు ఉండాలి! అందుకే అంటారు… కండువాలు మర్చే నాయకులు ఉంటారు కానీ.. నాయకుడిని మార్చే కార్యకర్తలు ఉండరని! అలాంటి వారు కోట్ల మంది ఉన్నారు జగన్ కోసం! ఇది ఈ బర్త్ డే నాడు జగన్ గ్రహించాలి. తెలుగురాజ్యం.కామ్ తరుపున జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు.. కాస్త ఆలస్యంగా..!!

