టి.కాంగ్రెస్ కష్టాలు ఇంతింత కాదయా

కాంగ్రెస్ నాయకుల కష్టాలు చెప్పతరం కావడం లేదు.
అసలే అధికారంలో లేక చాలా కాలం అయింది. ఖర్చులే కాని రాబడి లేదు. దాచుకున్న డబ్బులు కాస్త అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఠాకూర్…. పార్టీ కష్టాల్లో ఉంటే ఆదుకోలేరా, డబ్బులు ఖర్చు పెట్టలేరా అంటూ ఎన్నికల ఖర్చును కాంగ్రెస్ నాయకులే భరించాలని బరిలో నిలిచిన అభ్యర్థిని ఇబ్బంది పెట్టొద్దని కొత్త తిరకాసు పెట్టారు.

ప్రచారానికి వెళ్లడం అధికార పార్టీని దుమ్మెత్తిపోయడం తేలికే కాని ఎన్నికల ఖర్చు భరించమంటే ఎలా అని కాంగ్రెస్ నేతలు లోలోపల మదనపడిపోతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేదు. జేబులు దులిపినా చిల్లి గవ్వ రాలని పరిస్థితి. అప్పులతో నెట్టుకొస్తున్న ఈతరణలో ఖర్చులు భరించాలని హుకూం జారీ చేస్తే ఎలా అని బాధపడిపోతున్నారంటా. డబ్బులు లేవంటే పరువు పోతుంది. ప్రచారానికి వెళ్లకపోతే లైమ్ లైట్ లోకి రాలేరు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారంటా కాంగ్రెస్ నాయకులు.

ఎన్నికలు ఏవైనా డబ్బులు వెదజల్లాల్సిందే. ప్రచారం సామాగ్రి నుంచి కార్యకర్తల మందు, బిర్యానీ వరకు అన్నీ ఖర్చులు భరించాల్సిందే. సాధారణంగా ఈ ఖర్చు అంతా అభ్యర్థిదే. ఇతర ప్రాంతాల నాయకులు ప్రచారం కోసం వస్తే వాళ్ల ఖర్చులు కూడా అభ్యర్ధే భరిస్తాడు. ఠాకూర్ ఆదేశాలతో దుబ్బాక కాంగ్రెస్ లో సీన్ రివర్స్ అయింది. మామూలుగానే ఎన్నికల ఖర్చు తడిసి మోపడు అవుతుంది. ఇక ఉపఎన్నికల్లో అయితే అధికార పార్టీ వనరుల వరద ముందు తట్టుకొని నిలబడాలంటే బాగా చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ , బీజేపీల మధ్య హోరాహోరీగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోంది కాని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఎన్ని రకరకాల ఫ్యూహాలు పన్నినా డబ్బులు వెదజల్లకపోతే పని కాని పరిస్థితి నెలకొంది. దీంతో అటు డబ్బులు తీయలేక ఇటు ప్రచారం చేయలేక కాంగ్రెస్ నాయకులు సతమతమవుతున్నారంటా.