రచన -దర్శకత్వం : వరుణ్ రెడ్డి
తారాగణం : శ్రీ నందు, యామినీ భాస్కర్, ప్రియాంకా రెబెకా, నరసింహ ఎస్, శ్రీనివాస్ తదితరులు
సంగీతం : స్మరణ్ సాయి, ఛాయాగ్రహణం : కె. ప్రకాశ్ రెడ్డి, కూర్పు : ప్రతీక్ నూట
నిర్మాతలు : శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి టి.
విడుదల : జనవరి 1, 2026
హీరోగా శ్రీనందు కొన్నేళ్లుగా బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. క్యారక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశాడు గానీ, హీరోగా నటించిన ఆరు సినిమాలూ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏడో ప్రయత్నంగా ‘సైక్ సిద్ధార్థ్’ తో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. దీనికి పెద్ద బ్యానర్ల అండ వుంది. సురేష్ ప్రొడక్షన్ కల్పించుకుని రిలీజ్ చేసింది. వరుణ్ రెడ్డి దీనికి దర్శకుడు. యామినీ భాస్కర్ హీరోయిన్. ఈ ఆకర్షణీయ హంగులన్నీ జత చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రయత్నమైనా సక్సెస్ అయిందా లేదా రివ్యూలో చూద్దాం…
కథేమిటి?
సిద్ధార్థ (నందు) ఓ రోజు పబ్‌లో త్రిష (ప్రియాంకా రెబెకా) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె అంటే పిచ్చి ప్రేమతో ఏమైనా చేయాడానికి సిద్ధపడతాడు. అలా త్రిషని, ఫ్రెండ్ మన్సూర్ నీ కలుపుకుని తన దగ్గరున్న మొత్తం రెండు కోట్లు పెట్టుబడి పెట్టి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభిస్తాడు. కొత్త కలం గడిచ్చాక అయితే త్రిష -మన్సూర్ ఇద్దరూ ఒకటై సిద్ధార్థ్ ని మోసం చేస్తారు. ఫ్రెండ్ తో బాటు పిచ్చిగా ప్రేమించిన త్రిష కూడా మోసం చేయడంతో సిద్ధార్థ్ పిచ్చెత్తి పోతాడు. చేతిలో డబ్బులేని పరిస్థితుల్లో ఓ చిన్న రూమ్ అద్దెఇకి తీసుకున్ దిగుతాడు. తాగుడుకి బానిసై పోతాడు.
ఇలా వుండగా, ఇదే ఇంట్లో కింది గదిలో శ్రావ్య (యామినీ భాస్కర్) అద్దెకి దిగుతుంది. ఈమె భర్త పెడుతున్న హింస భరించలేక కొడుకుని తీసుకుని వచ్చేసింది. ఇప్పుడు సిద్దార్థకి శ్రావ్య తో పరిచయం, సాన్నిహిత్యం పెరుగుతాయి. సిద్దార్థ్ పరిస్థితి తెలుసుకున్న శ్రవ్య అతడ్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పరస్పరం ఎలా ఫీలయ్యారు? ఏం చేశారు? సిద్ధార్థ్ తిరిగి మామూలు మనిషి అయ్యాడా? ఆఖరికి అతను తీసుకున్న నిర్ణయమేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ?
అమ్మాయిల చేతిలో మోసపోయే అబ్బాయిల కథలతో వస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. కారణం, నగర జీవితాల్లో రిలేషన్ షిప్ సర్కిల్స్ లో అబ్బాయిలకి ఎదురవుతున్న చేదు అనుభవాలివే. ఈ వర్గం ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకుని ఇటీవల ‘బేబీ’ తీసి సక్సెస్ సాధించారు. ఈ సినిమాలు ఈ వర్గం ప్రేక్షకులకి దగ్గరవడానికి హీరోయిన్ నెగెటివ్ క్యారక్టర్ ని చేసి బోల్డ్ గా చూపిస్తున్నారు. అడల్ట్ కంటెంట్ ని నిర్మొహమాటంగా ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రేమలో మోసపోయిన అబ్బాయిల మానసిక వ్యధ ని కూడా చిత్రిస్తూ సాగే ఈ టైపు కథతో వచ్చిన మరో సినిమానే ప్రస్తుత సినిమా. అయితే ఈ ఫార్ములాని అనుసరిస్తూ చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అయ్యే అవకాశాలు లేకపోయినా యావరేజిగా మిగులుతుంది.
కారణం, ఈ కథని లోతుగా తడిమి చూడలేదు. అసలు కథనే పట్టించుకోలేదు. యూత్ కి క్రేజ్ పుట్టించాలన్న ఎజెండా ఒక్కటే పెట్టుకుని అడల్ట్ సీన్లు, రెబెల్ సీన్లు పేర్చుకుంటూ పోయారు. వివిధ టాపిక్స్ తో రీల్స్ చూపిస్తున్నట్టు చేసుకుంటూ పోయారు. పైన చెప్పుకున్న విధంగా ఫస్టాఫ్ ‘కథ’ నడిపించుకుంటూ పోయాక, తాగుడుకి బానిసైన సిద్ధార్థ్ ని శ్రావ్య మార్చడమే సెకండాఫ్ ‘కథ’ గా కనిపిస్తుంది. దీన్ని చాలా బోల్డ్ గా చూపించారు. అలాంటి సీన్లనే ఎక్కువ పెట్టారు. చివరికి ఈ రిలేషన్ షిప్ ని ఎలా ముగించారన్నది ప్రశ్నయితే, అది ఎమోషనల్ గా వుండే ఫార్ములానే. కొత్తగా ఏం చెప్పలేదు. ఒకమ్మాయితో ప్రేమలో మోసపోయిన అబ్బాయి, మరో అమ్మాయి సాయంతోనే కోలుకోగలడని చూపించే ఈ కథలు అబ్బాయిల్ని చిన్నచూపు చూస్తున్న అర్ధంలో వుంటున్నాయన్నది స్పష్టమవుతోంది.

ఎవరెలా చేశారు?
నటన వరకూ చూస్తే నందు సిద్దార్థ్ పాత్రని కాస్త ఓవర్ గానే పోషించాడు. అతి ఎక్కువున్న నటనతో హడావిడీ చేసి, డామినేట్ చేసి సినిమాని నిలబెట్టాలన్న ప్రయత్నమే కనిపిస్తోంది. కథంటూ లేని సినిమాకి హద్దుల్లేని నటనే రక్ష అన్న నమ్మకం ఫలించిందా అంటే యావరేజ్ దగ్గరే సినిమాని ఆపేసింది. శ్రావ్య పాత్రలో యామినీ భాస్కర్ హద్దుల్లో ఉంటూ నటించింది. అయితే నందుది అతివృష్టి అయితే తనది అనావృష్టే. ఇంకా కృషి చేయాల్సిన అవసరముంది. త్రిష పాత్రలో ప్రియాంక రెబెకా ఫర్వాలేదు. అలాగే మన్సూర్ గా సుఖేష్ రెడ్డి ఫర్వాలేదు.
సాంకేతికాలేమిటి?
స్మరణ్ సాయి సంగీతం, బీజీఎం ఓ మాదిరిగా వుంది. ప్రకాష్ రెడ్డి కెమెరా వర్క్ ఫర్వాలేదు. ప్రతీక్ నూతి ఎడిటింగ్ లో కంటెంట్ లేకపోవడంతో సీన్లు రిపీట్ అవుతూ వుంటాయి. ఈ సీన్లు తీసేస్తే సినిమలోఎమీ మిగలదు. దర్శకుడు వరుణ్ రెడ్డి సినిమాని నిర్లక్ష్యంగానే తీశాడని చెప్పాలి. కథా కథనాలు పట్టించుకోకుండా కేవలం క్యారక్టర్స్ తో బోల్డ్, క్రేజీ పనులు చేయిస్తే సరిపోతుందన్న అతడి అవగాహన తప్పు. ప్రేక్షకుల్ని ఈజీగా తీసుకుని సినిమాని చుట్టేస్తే మౌత్ టాక్ తో అది లుంగ చుట్టుకుని పోతుంది. రానున్న వారంలో సంక్రాంతి భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ వాస్తవం కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
రేటింగ్ : 2 / 5

