ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవమైన నవంబరు ఒకటో తేదీన రాహుల్ గాంధీని చంద్రబాబు కలిశారో లేదో అప్పుడే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.
దేశ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కీలక పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే సిపిఐ నేతలను కలుసుకున్నారు. తాజాగా గురువారం ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీని కలిశారు.
వారిద్దరి భేటీ ముగిసిన కొద్ది వ్యవధిలోనే ఆంధ్రా కాంగ్రెస్ కీలక నేత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనెవరో కాదు ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీనాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వట్టి వసంత కుమార్. ఆయన ప్రస్తుతం ఎఐసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
తెలుగు నేల మీద చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, టిడిపిలు ఒక్కటి కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అందుకే తన రాజీనామాను ఎఐసిసికి పంపించేశారు.
వట్టి వసంతకుమార్ కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఆయన గోదావరి జిల్లాల్లో వట్టి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన వట్టి వైసిపిలో చేరతారా? లేదంటే జన సమితి గూటికి చేరతారా అన్న చర్చ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వట్టి వసంతకుమార్ వైఎస్సార్ కు ఆప్త మిత్రుడు.
టిడిపి కాంగ్రెస్ అనైతిక పొత్తును నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వట్టి ప్రకటించారు. 1983 నుంచి పోరాడుతున్న టిడిపి తో చేతులు కలపడమేంటని ఆయన ప్రశ్నించారు.
మొత్తానికి కాంగ్రెస్, టిడిపి దగ్గరవుతున్న సంకేతాలు రాగానే ఆంధ్రా కాంగ్రెస్ లో రాలిన తొలి వికెట్ వట్టిదే కావడం గమనార్హం.