రేవంత్ రెడ్డి రేటెంత.? బీజేపీ క్యాంపెయిన్ వేరే లెవల్.!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి, అటు కొడంగల్‌తోపాటు ఇటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీకి దిగారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.

భారత్ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచీ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోటీ రసవత్తరంగా మారింది. ఇద్దరూ సీఎం అభ్యర్థులే కావడం గమనార్హం. రేవంత్ రెడ్డి విషయమై కొంత గందరగోళం వుందనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, బీజేపీ నుంచి ఎడా పెడా నాయకుల్ని లాగేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే, రేవంత్ రెడ్డిని, ‘రేటెంత రెడ్డి’ అంటూ బీజేపీ వెటకారం చేస్తోంది. అంతే కాదు, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, గంపగుత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, భారత్ రాష్ట్ర సమితికి రేవంత్ రెడ్డి అమ్మేస్తారన్నది బీజేపీ ఆరోపణ.

బీజేపీ ఆరోపణలు కింది స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేలానే వున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గులాబీ పార్టీకి అమ్ముడుపోవడంలో వింతేముంది.? 2014 ఎన్నికల తర్వాతా, 2018 ఎన్నికల తర్వాతా జరిగింది అదే కదా.! ముచ్చటగా మూడో సారి కూడా అదే జరుగుతుందేమో.!

అందుకే, కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడమెందుకు.? ఆ ఓటు నేరుగా గులాబీ పార్టీకే వేస్తే పోలా.. అన్న అభిప్రాయం జనంలో వున్నా లేకున్నా, ఆ అభిప్రాయాన్ని జనంలో బలంగా రుద్దుతోంది బీజేపీ. ఇది పరోక్షంగా గులాబీ పార్టీకి బీజేపీ సహకరిస్తున్న వైనంలానే కనిపిస్తోంది.

బీజేపీ క్యాంపెయిన్‌ని కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టలేకపోతోందన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతోనే సరిపోతోంది ఆ పార్టీ నేతలకి.