మెగాస్టార్ చిరంజీవి, అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోగానీ.. ఇటు తెలంగాణ రాజకీయాల్లోగానీ తలదూర్చడంలేదు. కొన్నాళ్ళ క్రితం చిరంజీవి, మూడు రాజధానుల వ్యవహారానికి మద్దతివ్వడం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఆ సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చిరంజీవికి బాహాటంగానే అండగా నిలిచారు. సోదరుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అప్పట్లో చిరంజీవి వ్యాఖ్యలు రాజకీయంగా ఇబ్బందిని కలిగించాయి. కొందరు జనసైనికులు సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించగా, వారిని వారించింది జనసేన అధిష్టానం. తెలుగుదేశం పార్టీ తన సహజసిద్ధమైన ఆక్రోశాన్ని చిరంజీవి మీద ప్రదర్శించిందనుకోండి. అది వేరే విషయం. ఇదిలా వుంటే, కొన్నాళ్ళ క్రితం చిరంజీవితో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు జరిపింది. మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందిగా చిరంజీవిని కోరారు కొందరు బీజేపీ నేతలు. కానీ, చిరంజీవి అప్పట్లో ససేమిరా అన్నారు.
పవన్ వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా.?
తిరుపతి ఉప ఎన్నిక విషయమై మాట్లాడిన సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి వుంటే..’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, అవి వ్యూహాత్మకంగా చేశారా.? అనుకోకుండా వచ్చిన ప్రస్తావనా.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి. కానీ, బీజేపీ మనసులో మాటనే పవన్ కళ్యాణ్ చెప్పారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీకి చెందిన నేతలు మాత్రం, ఈ విషయాన్ని వేరే కోణంలో చూడొద్దంటున్నారు.
జమిలికీ, చిరంజీవికీ లింకేంటి.!
జమిలి ఎన్నికలంటూ వస్తే, చిరంజీవి వున్నపళంగా రాజకీయాల్లోకి రావొచ్చన్న ప్రచారం కమలదళంలో సాగుతోంది. దానికీ, దీనికీ లింకేంటి.? అంటే, చిరంజీవికి వున్న ప్రజాదరణను క్యాష్ చేసుకోవాలన్నది బీజేపీ యత్నమట. కానీ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి, చిరంజీవి తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఇప్పటికే ఆయా పార్టీలకు తేల్చి చెప్పేశారట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసినప్పుడుగానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయినప్పుడుగానీ, తన రాజకీయ రంగ పునఃప్రవేశంపై సానుకూల వ్యాఖ్యలు చిరంజీవి చేయనేలేదట.
సినిమాలే బెటర్ అంటున్న చిరంజీవి
ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి, తక్కువ కాలంలోనే రాజకీయాల్లో ఎత్తుపల్లాల్ని చవిచూసేశారు. రాజకీయం అంటే ఎలా వుంటుందో ఆయనకు బాగానే అర్థమయిపోయింది. అందుకే, తాను అందరివాడిలానే వుండాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చారట. తన సోదరుడు పవన్ రాజకీయ ఆలోచనల పట్ల కొంత అసంతృప్తి చిరంజీవికి కూడా వున్నా, ఆయనెక్కడా ఆ విషయాన్ని బాహాటంగా చెప్పలేదు, చెప్పలేరు కూడా.