రాష్ట్రపతి భవన్లో తొలిసారిగా పెళ్లి వేడుక జరగనుంది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న అదృష్టవంతురాలు CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను మహిళల బృందంతో లీడ్ చేసిన పూనమ్ ప్రతిభను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తన అధికార నివాసంలో వివాహ వేడుకకు అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 12న ఈ పెళ్లి ఘనంగా జరగనుంది.
పూనమ్ గుప్తా గణితంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 2018 UPSC CAPF పరీక్షలో 81వ ర్యాంక్ సాధించి CRPFలో అసిస్టెంట్ కమాండెంట్‌గా నియమితులయ్యారు. బీహార్ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఆమె చేసిన సేవలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (PSO)గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ విద్యార్థులకు మోటివేషన్ పోస్టులు చేస్తూ, మహిళా సాధికారత కోసం తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
పూనమ్ గుప్తా వ్యక్తిగతంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరగా, ద్రౌపది ముర్ము వెంటనే అంగీకరించారు. దీంతో ఆమె రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకునే తొలి వ్యక్తిగా చరిత్రకెక్కబోతున్నారు. CRPF అసిస్టెంట్ కమాండెంట్ అవనీష్ కుమార్‌తో ఆమె వివాహం జరగనుంది. పెళ్లి వేడుకకు రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌ను అందంగా ముస్తాబు చేస్తున్నారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారు. గెస్ట్‌ల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వగా, భద్రత ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే ప్రత్యేకమైన ఈ పెళ్లి కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.