Raju Weds Rambai Movie Review: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ!

రచన, దర్శకత్వం: సాయిలు కంపాటి
తారాగణం : అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజీ రాజా, చైతూ జొన్నలగడ్డ, అనితా చౌదరి తదితరులు

సంగీతం : సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రహణం:వాజిద్ బేగ్, కూర్పు : నరేష్ అడుపా
బ్యానర్ : ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
సహ నిర్మాతలు: ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
విడుదల : నవంబర్ 21, 2025

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పరిమిత బడ్జెట్‌లతో థియేట్రికల్ రిలీజ్ కోసం కొత్త ముఖాలతో కంటెంట్-ఆధారిత సినిమాల్ని నిర్మిస్తోంది. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ ప్రేమ కథ ఇలాటి ఒక భారీ హిట్ ని సాధించింది. తిరిగి ఇప్పుడు ఇంకో ప్రీమ కథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ తో తిరిగి వచ్చింది. ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల దీనికి సహ నిర్మాతగా వున్నారు. సాయిలు కంపాటి కొత్త దర్శకుడు. అఖిల్ రాజ్ -తేజస్వినీ రావు హీరో హీరోయిన్లు. ఒక షాకింగ్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా నిర్మించినట్టు దర్శకుడు చెప్పాడు. దీంతో ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఆ షాకింగ్ రియల్ స్టోరీ ఏమిటనేది తెలుసుకోవాలన్న కుతూహలంతో ఈ సినిమా కెళ్తే ఎలా వుండచ్చో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే…

కథేమిటి?

ఖమ్మం జిల్లా ఇల్లందుకి సమీపంలోని ఓ గ్రామంలో రాజు (అఖిల్ రాజ్) కులవృత్తి బ్యాండ్ మేళం నిర్వహిస్తూంటాడు. పెళ్లికైనా చావుకైనా తను బ్యాండ్ వాయించాల్సిందే. తల్లిదండ్రులు (శివాజీ రాజా, అనితా చౌదరి) తో నివసించే అతను ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతూంటాడు. అదే గ్రామంలో వెంకన్న(చైతూ జొన్నలగడ్డ) ప్రభుత్వ హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తూంటాడు. ఈ నేపథ్యంలో ఇతడి కూతురు రాంబాయి (తేజస్వినీ రావు) తో రాజు ప్రేమలో పడుతాడు. ఈ ప్రేమ హాయిగా సాగుతున్నప్పుడు వెంకన్నకి తెలుస్తుంది. ప్రాణం కంటే కులం మిన్నగా భావించే వెంకన్న ఈ ప్రేమకి అడ్డుపడతాడు. రాజు కుటుంబం మీద గొడవకి వెళ్తాడు. కూతుర్ని గవర్నమెంట్ ఉద్యోగికిచ్చి చేస్తాను తప్ప రాజుకి కాదని చెప్పేస్తాడు. అయినా రాజు- రాంబాయిలు ఆగరు. పరిస్థితిలు తీవ్రమవుతాయి. ఈ పరిస్థితుల్లో వెంకన్న షాకింగ్ గా ఏ అమానవీయ నిర్ణయం తీసుకున్నాడనేది మిగతా కథ.

ఎవరెలా చేశారు?

రాజుగా అఖిల్ రాజ్ నటన ఓకే గానీ, అతను ఎప్పుడెలా బిహేవ్ చేస్తాడో అంతుపట్టదు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో స్పష్టం కాదు. నెగెటివ్ షేడ్ వున్న హీరో క్యారక్టర్ కి డిమాండ్ ఉందన్న కారణం ఒక్కటే కనిపిస్తుంది. ఈ క్యారక్టరైజేషన్ తో పదే పదే హీరోయిన్నికొట్టడాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న పట్టింపు కూడా కనిపించదు. దీనివల్ల ప్రేమ కథలో ఫీల్ లోపించింది. ఇలా రాజు- రాంబాయిల ప్రేమ కథ యాంత్రికంగా సాగుతుందే తప్ప అందులో ఎమోషన్ కూడా కనిపించదు. ఎమోషన్ ఫి లవ్వాలంటే రాజు పాత్రే అడ్డు. హీరోయిన్ని కొట్టే అతడి స్వభావమే ప్రేమ కథకి సున్నితత్వం లేకుండా చేసింది. ఇలాటి పల్లెటూరి యువకుడుగా అఖిల్ రాజ్ నటన వరకూ ఓకే, పాత్ర కాదు.

ఇక రాంబాయిగా హీరోయిన్ తేజస్వికి ఇటు రాజుతోనే గాక అటు తండ్రితోనూ హింసే. తట్టకోలేక పోతుంది. సినిమా ప్రారంభంలో రాజుతో ఆమె రోమాన్స్ సినిమాటిక్ అయినా కాలక్షేపంగా వుంటుంది. కానీ ఎప్పుడైతే రాజు కొట్టడం మొదలెడతాడో అక్కడ్నుంచీ ఈమెతో కూడా లవ్ స్టోరీ ఎంజాయ్ చేయడానికి మిగలదు. రాజుతో ఆమె ఎందుకు ప్రేమలో పడిందో తెలీదు.

తండ్రి వెంకన్నగా చైతూ జొన్నలగడ్డ ప్రవర్తన కూడా చిరాకు పుట్టిస్తుంది. విలన్ చిరాకు పుట్టిస్తే విలనీ పండదు. ఈ విషయం గ్రహించలేదు దర్శకుడు. కులపట్టింపు వున్న పాత్రగా కూతురి ప్రేమ విషయంలో క్లయిమాక్స్ లో తీసుకునే నిర్ణయంతో మాత్రం షాక్ పుట్టిస్తాడు. ఈ పాత్రలో చైతూ జొన్నలగడ్డ నటన ఫర్వాలేదు.

ఇక రాజు తండ్రిగా శివాజీ రాజా, అతడి భార్యగా అనితా చౌదరి పాజిటివ్ క్యారక్టర్లు ఫర్వాలేదన్పించేలా నటించారు. మిగిలిన మైనర్ పాత్రల్లో ఆయా నటీనటులు రూరల్ జీవితాన్ని కళ్ళకు కట్టారు.

సాంకేతికాల సంగతి?

ఈ ప్రేమ కథకి సురేష్ బొబ్బిలి మంచి సంగీతం అందించాడు. పాటలు హిట్. అయితే ప్రేమ బలహీన పడ్డ దృశ్యాలని అతడి బ్యాక్ స్కోరే కాపాడింది. అలాగే రూరల్ దృశ్యాల్ని అందంగా చిత్రీకరించిన వాజిద్ బేగ్ కెమెరా వర్క్ కూడా చెప్పుకోదగ్గది. నరేష్ అడుపా ఎడిటింగ్ బలహీన కథతో ఏమీ చేయలేక వదిలేసినట్టుంది. ఇతర సాంకేతికాలు, నిర్మాణ విలువలూ పరిమిత బడ్జెట్ కి తగ్గట్టున్నాయి.

ఇంతకీ కథెలా వుంది?

ఖమ్మం జిల్లాలో 2010లో మీడియాలో కూడా రాని సంఘటన ఆధారంగా ఈ కథ చేశామని దర్శకుడు చెప్పాడు. అయితే ఆ సంఘటన చూపించడానికే ప్రేమ కథ నడిపినట్టుందే తప్ప, ప్రేమ కథలో భాగంగా ఆ సంఘటన పుట్టినట్టు వుండదు. క్లయిమాక్స్ లో ఆ నిజ సంఘటన పెట్టుకుని, ప్రేమ కథని అక్కడికి ఎలాగోలా చేరవేస్తే చాలన్న ప్రయత్నమే కనిపిస్తుంది. దీనివల్ల సెకండాఫ్ లో నడిపిస్తున్న ప్రేమ కథకి తగిన విషయమే కనిపించకుండా పోయింది. ఫస్టాఫ్ గ్రామంలో పాత్రల పరిచయాలు, హీరో ఫ్రెండ్స్ తో కామెడీలు, హీరోయిన్ తో రోమాన్సూ, వగైరా కాలక్షేపంగా సాగుతూ కథ కోసం ఎదురు చూసేలా చేస్తాయి. ఇంటర్వెల్లో హీరో హీరోయిన్ల తండ్రుల ఘర్షణ తీవ్రమై హీరో తండ్రి గుండె పోటుతో మరణిస్తాడు.

ఇక సెకండాఫ్ ప్రారంభిస్తే ఎక్కడికక్కడ ఆగిపోయిన కథ ముందుకు కదలదు. క్లయిమాక్స్ లోనే కథని ముందుకి కదిలించాలని నిర్ణయించుకున్నట్టు సమస్యలో పడ్డ ప్రేమ కథ ఏదో నాంకే వాస్తేగా సాగుతూనతుంది. ఆఖరికి క్లయిమాక్స్ రానే వస్తుంది. రాజుతో కూతురి ప్రేమ ఇష్టం లేని తండ్రి పాశవికంగా మారి తెగబడే సన్నివేశమే ముగింపు. ఈ సన్నివేశం మాత్రం ఎక్కడా కనీవినీ ఎరుగనిది. అందుకే అంత షాకింగ్.

అయితే ఈ షాకింగ్ ముగింపుకి దారితీసే ప్రేమ కథే సరిగా లేకపోవడం ఈ సినిమాకి మైనస్. హిందీలో బాగా హిట్టయిన ‘సైరత్’ (2016) కూడా కుల సమస్యతో షాకింగ్ ముగింపే. దీన్ని చూసైనా ప్రేమ కథని ఫీల్ తో, తగిన ఎమోషన్స్ తో అల్లి ఉండాల్సింది కొత్త దర్శకుడు. మొత్తానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’ షాకింగ్ ముగింపుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చూడాలన్నట్టు తీసిన సినిమాగా భావింఛి చూడాలి.

రేటింగ్ : 2.5 / 5

Cine Critic Dasari Vignan About DNA On Laptop Cracks 2017 US Murder Of Indian Mother And Child || TR