జూలై 14.. చంద్రబాబు.. పడవబోల్తా.. రాజమండ్రి తొక్కిసలాట

జూలై 14వ తేదీకి ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సంబంధం ఉందా? సరిగ్గా నాలుగేళ్ల క్రితం పుష్కరాల సందర్భంగా ఇదే జూలై 14 తేదీన రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం కేవలం ఎపి సిఎం చంద్రబాబే అని ఇప్పటికీ ప్రతిపక్ష వైసిపి ఆరోపిస్తోంది. చంద్రబాబు పుష్కర ఘాట్ లో సినిమా షూటింగ్ చేయడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని, తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీతోపాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. విఐపి ఘాట్ లో చంద్రబాబు స్నానం చేసి ఉన్నా, షూటింగ్ చేయకపోయినా 30 మంది ప్రాణాలు దక్కేవని విపక్షాలు అంటన్నాయి.
ఇక తాజా పరిస్థితులు ఒకసారి చూస్తే ఈరోజు శనివారం, తేదీ జూలై 14. ఈరోజు కూడా అభం శుభం తెలియని చిన్నారులు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో తరగతి, ఆరో తరగతి చదివే పసిమొగ్గలు తూర్పుగోదావరి జిల్లాలో పశువుల లంక వద్ద జరిగిన పడవ బోల్తా ఘటనలో ప్రాణాలు వదిలారు. ఈ ఘటనకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు వైఖరే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు రెండో శనివారం అయినా పాఠశాలలు నడిపారని వైసిపి చెబుతోంది. చంద్రబాబు ప్రవేశపెట్టిన వనం మనం కార్యక్రమంలో ఈ చిన్నారులంతా పాల్గొని తిరుగుముఖం పట్టిన సమయంలో పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతోంది వైసిపి. నిజానికి వనం మనం పేరుతో సెకండ్ శనివారం పాఠశాల విద్యార్థులను రప్పించకపోతే ఈ ప్రమాదం జరిగేదే కాదని విపక్షాలు అంటున్నాయి. యాదృచ్ఛికమో.. మరేదో కానీ రెండు ప్రమాదాలు జూలై 14న జరగడం, అదికూడా ఆ ఘటనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సిఎం చంద్రబాబు వైఖరే కారణం కావడం ఆంధ్రాలో విషాధం నింపిందని చెబుతున్నారు.

పడవ ప్రమాదం ఇలా జరిగింది..
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పశువుల లంక వద్ద పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఐ.పోలవరం మండలంలోని తలారివారిపాలెం నుంచి పశువులలంకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 31 మంది విద్యార్ధులతో వెళ్తున్న పడవ నీటి ప్రవాహానికి అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ ను ఢికొట్టడంతో పడవ బోల్తా పడింది. పడవ బోల్తా పడిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వెళ్లి మరికొన్ని పడవల ద్వారా నీటిలో పడ్డ పిల్లలను రక్షించారు. 25 మంది పిల్లలను క్షేమంగా తీసుకువచ్చినప్పటికి మరో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులను రమ్య, మనీష, శ్రీజ, ప్రియ, అనూష, సుచిత్ర లుగా గుర్తించారు. వీరంతా పశువుల లంక పాఠశాలలో చదువుతున్నారు. వీరు శేరిలంక, కే.గంగవరం,పామర్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గల్లంతైన వారికోసం ఇప్పటికే ఎన్డీఆర్ ఎప్ బృందాలు గాలిస్తున్నాయి. విశాఖ నుంచి నావికాదళాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు బయలుదేరాయి. చీకటి కావడం, వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది.