Raja Singh Slams TG BJP Leadership: తెలంగాణ బీజేపీలో ‘ఫుట్‌బాల్’ వార్: కిషన్ రెడ్డిపై రాజాసింగ్ తీవ్ర విమర్శలు

బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్, తెలంగాణ బీజేపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనను నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ బీజేపీలో పరిస్థితి దారుణంగా ఉందని, సొంత నేతల నుంచే పోరాటం ఎదురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత 11 ఏళ్లుగా సొంత పార్టీ నేతలు తనతో ‘ఫుట్‌బాల్’ ఆడుకున్నారని, తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని రాజాసింగ్ వెల్లడించారు. ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ అగ్ర నాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ, ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ఫుట్‌బాల్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్లమెంటులో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా సొంత పార్టీ వారే డిస్టర్బ్ చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “నా అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి తన మనుషులను పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నా ఏరియాలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఏముంది?” అని నిలదీశారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ నాయకత్వం తక్షణమే సమీక్ష జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ బీజేపీలో పరిస్థితి దారుణంగా ఉందని, తమకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో కాకుండా సొంత నాయకులతోనే పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. “బయటి నుంచి నేతలను తెచ్చుకునే బదులు, ఉన్న కార్యకర్తలకు నిధులు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటే మంచి నాయకులు తయారవుతారు కదా? బీజేపీ కార్యకర్తలు ఎప్పటికీ లేబర్లుగానే పనిచేస్తూ బతకాలా?” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజాసింగ్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో నెలకొన్న తీవ్ర అంతర్గత విబేధాలను, అసంతృప్తిని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి.

చంద్రబాబు బాగోతం || Analyst Chitti Babu EXPOSED Chandrababu Reaction On Jr NTR Mother Issue || TR