సచిన్ ను తాకిన రెజ్లర్ల నిరసన సెగ… తెరపైకి కాకి కథ!

కేంద్రప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్న వేళ, ప్రపంచ క్రీడా వేదికలపై భారత తివర్ణ పథాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులు రోడ్లపైకి వచ్చారు.. పోలీసులతో రోడ్లపై ఈడ్పించుకున్నారు.. నియంతృత్వ పాలకుల పోలీసు బూట్ల కింద నలిగారు.. అరెస్టులు కాబడ్డారు.. ఆఖరికి దేశ చరిత్రలో కలికుతురాయిలుగా ఉన్న పథకాలను నదిలో పారేస్తామనే వరకూ వచ్చారు! అయినా కూడా ప్రభుత్వంలో స్పందన లేదు.. పాలకుల్లో చలనం లేదు! విచిత్రం ఏమిటంటే… తోటి క్రీడాకారుల్లో కొంతమందైతే తమకేమీ తెలియదన్నట్లు పట్టించుకోకుండా ఉన్నారు.

ఒక కాకికి కష్టమొస్తే వందకాకులు చుట్టు చేరతాయి… మనిషి విషయంలోనే అది కనిపించదు! తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ ఉధృతం అవుతోన్నా… కొంతమంది క్రీడాకారులు మాత్రం సైలంట్ గా ఉన్నారు. అందుకు.. వారి వారి రాజకీయ కారణాలే కారణం అవ్వొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెజ్లర్ల నిరసన సెగ సచిన్ టెండూల్కర్ ను కూడా తాకింది. రెజ్లర్లకు మద్దతుగా నిలవాలని సచిన్ ఇంటివద్ద తాజాగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఇప్పటికే రెజ్లర్ల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు, పలువురు క్రీడాకారులు, రైతు సంఘాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబై యూత్ కాంగ్రెస్ నాయకులు.. రెజ్లర్లకు మద్దతుగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా… ముంబైలోని బాంద్రా వెస్ట్ పెర్రీ క్రాస్ రోడ్ లోని సచిన్ ఇంటివద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు బ్యానర్లు ప్రదర్శించారు. భారతరత్న పొందిన గొప్ప వ్యక్తి అయిన సచిన్… తమను వేధిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన తెలుపుతుంటే ఎందుకు మద్దతుగా నిలవలేదని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కాస్త వాయిస్ పెంచిన యూత్ కాంగ్రెస్ నాయకులు… “మీరు కూడా సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ దాడులకు భయపడుతున్నారా..? అందుకే రెజ్లర్ల విషయంలో మౌనంగా ఉన్నారా..? అని తీవ్రస్వరంతో సచిన్ ను ప్రశ్నించారు. మరి ఈ విషయాలపై సచిన్ స్పందిస్తారా? గోడకు అంటించిన పోస్టర్స్ తనకు కనిపించలేదని తప్పించుకుంటారా? అన్నది వేచి చూడాలి!