కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. దానికి తగ్గట్లుగానే కేడర్ లో కొత్త జోష్ కనిపిస్తుంది. పైగా మునుపెన్నడూ లేని విధంగా సీనియర్లూ జూనియర్లు అనే వర్గ విభేదాలు ఏమీ కనిపించకుండా రాజకీయాలు జరుగుతున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా చేరికలు సైతం ఊపందుకున్నాయి. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతాదని అన్నట్లుగా… సరిగ్గా ఈ సమయంలో రేణుకా చౌదరి రంగప్రవేశం చేశారు.
సాదారణంగా… ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. ఆ పార్టీలోని నేతలు మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మాత్రం అంతకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ బహిరంగంగా సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడం.. గ్రూపులు కట్టి గొడవలు పెట్టుకోవడం చేస్తుంటారు. ఫలితంగా ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్ లుగా మారుతుంటారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోరు మీదుంది. జనంతో కలిసిపోతూ.. నేతలను కలుపుకుపోతూ.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీని గాడిలో పెట్టారు. ఫలితంగా చేరికలు సైతం బలంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో… ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లిని పార్టీలోకి రానున్నారని తెలుస్తుంది.
సరిగ్గా ఈసమయంలో మైకులముందుకు వచ్చారు రేణుకా చౌదరి. ఖమ్మం జిల్లాకు చెందిన నాకు తెలియకుండా అక్కడి నాయకులను ఎలా చేర్చుకుంటారని ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు కేసీ. వేణుగోపాల్‌ను కూడా కలిసి.. ఖమ్మం రాజకీయ వ్యవహారాలపై ఫిర్యాదు చేశారు. దీంతో… మరోసారి రేణుక రచ్చ తెరపైకి వచ్చింది.
ఇది ప్రిస్టేజ్ లకు పోయే సమయం కాదు.. రేవంత్ కి కాల్ చేసి ఇలాంటివి మరోసారి రిపీట్ అవ్వకుండా చూడండి అని చెప్పుకోవచ్చు.. పైగా రేవంత్ వీలైనంతవరకూ సీనియర్లందరినీ కలుపుకుని పోతూ, గౌరవిస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ సమయంలో తనకు చెప్పకుండా… తన ప్రత్యర్థి వర్గంగా భావించే భట్టి విక్రమార్క సన్నిహితుడు పొంగులేటిని చేర్చుకోవడంపై రేణుకా చౌదరి గుర్రుగా ఉన్నారు.
మరి రేణుకా చౌదరి చేసిన ఈ ఫిర్యాదుపై కాంగ్రెస్ పెద్దలు ఏమేరకు స్పందిస్తారు అనేది వేచి చూడాలి. అసలు స్పందిస్తారా లేదా అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది.