(మల్యాల పళ్లం రాజు*)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం నుంచి చాలా ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా చాలా జాగ్రత్త పడుతూ.. విస్తృత ఆలోచనతో అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధంగా తన వ్యూహరచన సాగించారు. ఇప్పటివరకూ ఒక సామాజిక వర్గానికి చెందిన మనిషిగా ముద్ర పడకుండా చూసుకుంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ, ప్రజలతో మమేకం అవుతూ వారికి చేరువవుతున్నారు.
ఒక దశలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జనసేన, జగన్ వైసీపీ, బీజేపీ సమైక్యంగా పోటీ చేస్తాయని ప్రచారం సాగింది. రాష్ట్రంలో వాతావరణం అందుకు అనుకూలంగా మారినట్లే కన్పించింది. కానీ, ప్రత్యేక హోదా విషయంలో మూడు పార్టీలు భిన్న ధోరణలు అవలంభించడం, మూడు పార్టీలు తమకు తామే రానున్న ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితి మారింది.
పవన్ కల్యాణ్ పై జగన్, జగన్ మోహన్ రెడ్డి పై పవర్ స్టార్ వ్యక్తిగత విమర్శలకు దిగడంతో జనసేన, వైసీపీ మధ్య అంతరం పెరిగింది. ఫలితంగా రెండు పార్టీలు సమీప భవిష్యత్ లో కూడా కనీసం అవగాహనకు వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. అయితే ఇంకా ఎన్నికలకు 10 నెలలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో ఊహించడం కష్టమే.
ప్రస్తుతం కాపు సామాజిక వర్గం అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. కాపు సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గితే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని గతంలో జరిగిన పలు ఎన్నికలలో రుజువైంది. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ అంశంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ద్వంద్వం ఓ ప్రకటన చేయడం, రిజర్వేషన్లు తన పరిధిలో లేదని చెబుతూ చేతులు ఎత్తివేయడంతో సంచలనం చెలరేగింది. జగన్ ప్రకటనను తనకు సానుకూలంగా మార్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన ఎత్తులు పారలేదు.
రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడని అనుమానిస్తున్న కాపు సామాజిక వర్గం యువతరం ఇప్పుడు పూర్తిగా పవన్ కల్యాణ్ వైపే చూస్తున్నారు. ఆ వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యం లోనే పవన్ కల్యాణ్ తప్పని సరి పరిస్థితుల్లో పశ్చిమ గోదావరిలో రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని, రిజర్వేషన్ల అంశం 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు కృషి చేస్తామని వివరించారు.
టీడీపీకి బీసీలు ఆయువుపట్టు వంటి వారు. కాపు రిజర్వేషన్ల విషయంలో తన వైఖరి ఎలా ఉన్నా చంద్ర బాబు నాయుడు బీసీలను దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. వైసీపీకి కూడా బీసీ జనాభాపై పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. కాపు రిజర్వేషన్లపై జగన్ ప్రకటన ఈ యత్నంలో భాగమే అనుకునే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ బీసీ గర్జనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో పెద్దగా బలంగా లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ బీసీలపై దృష్టి పెట్టాల్సి ఉంది.
బీసీ విధానంపై స్పష్టత లేకపోవడం ఓ లోపం. బీసీలపై, ఆ వర్గం జనాభా గురించి పవన్ కు పూర్తి అవగాహన లేదు. పవన్ తన 9 అంశాల మేని ఫెస్టోలో బీసీలకు అవకాశాన్ని బట్టి మరో 5 శాతం రిజర్వేషన్ల పెంపుదల, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
అయితే జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా, 50 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు కోరుతున్న బీసీలకు ఈ ప్రకటన సంతృప్తి కల్గించలేదు. మేని ఫెస్టో లోనే బీసీలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లకు కృషి చేస్తామని ప్రకటించకపోవడం వారికి ఆగ్రహ కారణమైంది. బీసీల ఓటు బ్యాంక్ పై పట్టు సాధించాలంటే, బీసీలపై జనసేన తన విధానాన్ని తెలుపుతూ విస్పష్ట ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కల్యాణ్ అసలు రిజర్వేషన్లే ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
జన సేన అధినేత రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తాడా పార్టీలో కీలక పదవులు ఇస్తారా. లేక రిజర్వేషన్లు లేకుండా ముందుకు పోతానని ప్రకటిస్తారా అన్నది లక్ష డాలర్ల ప్రశ్న. బీసీల విషయంలో స్పష్టమైన విధానం ప్రకటించని పక్షంలో కాపు రిజర్వేషన్ విషయంలో పవన్ కల్యాణ్ ప్రకటన బీసీల్లో ప్రతికూల అభిప్రాయం కలిగే అవకాశం లేక పోలేదు. అదే జరిగితే ఆయన కాపు సామాజిక వర్గానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయో గతంలో అనుభవమే…
(* మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)