Pawan Kalyan: మోదీ కర్మయోగి, కూటమి 15 ఏళ్లు స్థిరంగా ఉండాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్ష

దేశ సేవయే పరమావధిగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన కర్మయోగి అని, కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లకు తగ్గకుండా బలంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కర్నూలు శివారులోని నన్నూరులో ఏర్పాటు చేసిన ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, రాబోయే రెండు మూడు తరాల ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారని పవన్ కల్యాణ్ కొనియాడారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ద్వారా దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారని, గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయని తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోందని, జీవిత, ఆరోగ్య భీమాతో సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటం వల్ల ప్రజలు ఆదా చేసుకోగలుగుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ప్రతి కుటుంబానికి పన్నుల భారాన్ని తగ్గించారని కొనియాడారు. దేశ జెండా ఎంత పొగరుగా ఉంటుందో అలాగే దేశ పటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారని, దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ తీసుకువచ్చారని ప్రశంసించారు. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని తెలిపారు.

“కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. పెట్టుబడులు, పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం” అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ వేదిక నుంచే ప్రధాని నరేంద్ర మోదీ రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

సభకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించారు.

Jammalamadaka Nagamani Exclusive Interview About Her Political Journey | Telugu Rajyam