గందరగోళవాది పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan Janasena Party President
ఈ బిరుదేదో మనం ఇచ్చింది కాదండోయ్…ఎక్కడో ఉన్న తమిళనాడులోని ఒక పత్రిక పవన్ కళ్యాణ్ గూర్చి ఒక వ్యాసాన్ని రాస్తూ ఆయన్ను గందరగోళవాదిగా అభివర్ణించింది.  అందులో తప్పొప్పులు మనకు అనవసరం కానీ…మనకు ఎన్నడో తెలిసిన ఆ రహస్యం ఆ పత్రికవారికి ఇంత ఆలస్యంగా తెలియడమే మనకు విస్తుగొలిపే అంశం.
  
Pawan Kalyan Janasena President
Pawan Kalyan Janasena President

రెండోసారి మోసపోయిన కాపులు 

ఒక రాజకీయపార్టీని స్థాపించిన వారు మొదటిగా ఎదురైనా ఎన్నికల్లోనే పోటీ చెయ్యకపోవడం ఎప్పుడైనా విన్నామా?  రాష్ట్రంలో మేధావులకు తప్ప సామాన్య జనావళికి అంత పెద్దగా పరిచయం లేని జయప్రకాశ్ నారాయణ్ కూడా లోక్ సత్తాను రాజకీయపార్టీగా మార్చిన తరువాత 2009 లో సుమారు రెండు వందల పాతిక సీట్లకు పైగా పోటీ చేశారు.  ఆయన మాత్రమే గెలిచినప్పటికీ ఓట్లకోసం డబ్బులు పంచని పార్టీగా పేరు తెచ్చుకుంది.  మరి పవన్ కళ్యాణ్ వంటి కోట్లాదిమంది అభిమానులను కలిగున్న వీరనాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా పాకేజీ స్టార్ అని అపఖ్యాతి పాలయ్యారు.   బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతుదారుగా మిగిలిపోయి పార్టీని అప్పుడే హత్య చేశారు.  అయినప్పటికీ పవన్ ఏదో ఊడబొడుస్తాడని చాలామంది నమ్మారు.  ముఖ్యంగా కాపు కులస్తులు చిరంజీవి సాధించలేని మహత్కార్యాన్ని పవన్ కళ్యాణ్ సునాయాసంగా సాధిస్తాడని గుడ్డిగా నమ్మారు.  అప్పటివరకు వైసిపిని అభిమానించిన కొందరు కాపు యువత పవన్ కళ్యాణ్ వైపు తిరిగి వైసిపికి విమర్శించడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గూర్చి వారికేమి తెలుసు పాపం?  

అన్నీ సందేహాస్పద చర్యలే 

ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ చేసిన తెలివితక్కువ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు.  ఒక్క ఎన్నికలో పోటీ చేయకముందే బీజేపీతో కొన్నాళ్ళు, తెలుగుదేశంతో కొన్నాళ్ళు, కమ్యూనిస్టులతో కొన్నాళ్ళు, బహుజనసమాజ్ పార్టీతో కొన్నాళ్ళు అంటకాగారు.  చివరకు మాయావతికి సాష్టాంగ నమస్కారాలు కూడా ఆచరించారు.  పోనీ ఇంతమందితో సావాసం  చేసినా, సాధించింది ఏమైనా ఉన్నదా?  వారి సహకారంతో తనను నమ్ముకున్న నలుగురినైనా గెలిపించగలిగారా?  బీజేపీతో, తెలుగుదేశంతో స్నేహం చేసినా, ఆ స్నేహాన్ని మూడేళ్లకంటే నిలుపుకోలేకపోయారు.  మోడీని తెగ విమర్శించేసారు.  చంద్రబాబుతో రహస్య పొత్తు ఉన్నదని అనేకమంది ఆరోపిస్తున్నా, వారికి సంతృప్తికరమైన జవాబును ఇవ్వలేకపోయారు.  

ఢిల్లీ వీధుల్లో పరాభవం 

ఎన్నికల్లో తల బొప్పి కట్టగానే తన అసలు బలం ఏమిటో తెలిసొచ్చింది పవన్ కు.  తన గ్లామర్ విలువ ఒక్క సీటు మాత్రమే అని తెలియగానే ముచ్చెమటలు పోశాయి.  తనను సీఎం సీఎం అని వెర్రికేకలు పెట్టి డాన్సులు చేసిన అభిమానులు ఎటుపోయారో అర్ధం కాక,  తనకు తెరవెనుక ఆర్ధికసహకారం అందిస్తున్న చంద్రబాబు సైతం నడుములు విరిగి నేలవాలిపోవడంతో, జగన్మోహన్ రెడ్డి అరివీరభయంకర స్వరూపాన్ని చూసే ధైర్యం లేక, మళ్ళీ వెళ్లి బీజేపీ అధిదేవతలను ఆశ్రయించాడు!   బీజేపీతో తమకు పొత్తు ఉంది అనిపించాడు.  అయితే పవన్ తో మాకు పొత్తు ఉన్నదని ఈరోజు వరకు బీజేపీ అగ్రనేతలు ఎవ్వరూ ప్రకటించలేదు.     నిజంగా బీజేపీ కనుక పవన్ తో మైత్రి పట్ల ఆసక్తి కలిగి ఉంటే నెలకోసారి అయినా పవన్ ఢిల్లీ వెళ్లి హంగామా సృష్టించి ఉండేవారు.  బీజేపీతో మైత్రి ఉన్నట్లు ప్రకటించిన పదకొండు మాసాల తరువాత కూడా పవన్ ఢిల్లీ వెళ్లి కేవలం నడ్డాను కలవడానికి రెండు రోజులు వేచి చూడాల్సి వచ్చిందంటే అంతకన్నా దారుణమైన పరాభవం మరొకటి ఉంటుందా?  

పవనే మా దగ్గరకొచ్చాడని కౌంటర్ ఇచ్చిన బీజేపీ 

హైద్రాబాద్ నగర పాలక ఎన్నికల్లో యాభై మంది అభ్యర్థులను నిలబెడుతున్నామని అట్టహాసంగా ప్రకటించారు పవన్.  రెండు రోజుల తరువాత మాట మార్చేసి మా పార్టీ పోటీలో ఉండదు అని నాలుక మడతేశారు.  ప్రచారం చెయ్యాల్సిన సమయంలో ఢిల్లీ వెళ్లి మూడు రోజులు కాలక్షేపం చేసి తప్పించుకుని తిరిగారు. పోనీ హైద్రాబాద్ వచ్చిన తరువాతైనా మిత్రపక్షం కోసం ప్రచారం చేశారా అంటే అదీ లేదు.  కేసీఆర్ అంటే పవన్ కున్న భయమే అందుకు కారణం అని ఆంధ్రా, తెలంగాణల్లో అందరూ చెప్పుకుంటున్నారు.  పవన్ కళ్యాణ్ ఆస్తులు, జీవితం మొత్తం హైద్రాబాద్ తో ముడిపడి ఉంది.  అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలన్నా పవన్ నరాలు చచ్చుబడిపోతాయి అని అందరూ హేళనగా చెప్పుకుంటున్నారు.  ఎందుకంటే నగర పాలక ఎన్నికల్లో బీజేపీ గెలిచినా కేసీఆర్ కు వచ్చే నష్టం ఏమీ ఉండదు.  ఆయన పదవి మరో మూడేళ్లు నిక్షేపంగా ఉంటుంది.  అందుకే టీఆరెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడానికి పవన్ వణికిపోతున్నాడు అని ఆ పార్టీ నాయకులే ముసిముసిగా నవ్వుకుంటున్నారు.  

అందరూ కలిసి పవన్ గాలి తీసేసారు 

మరొక విశేషం ఏమిటంటే ఇన్నాళ్లూ బీజేపీయే పవన్ కళ్యాణ్ ప్రాభవానికి ఆశ్చర్యపోయి పవన్ తో పొత్తు లేకపోతె తమకు భవిష్యత్తు లేదు అని నిశ్చయించుకుని పవన్ తో మైత్రి పెట్టుకుందని మనమంతా నమ్ముతున్నాము.  కానీ అదంతా ఒత్తి గ్యాస్ ప్రచారమని, పవన్ కళ్యాణే వచ్చి మాతో పొత్తు పెట్టుకున్నాడని, ఆయనతో మాకు ఎలాంటి మైత్రి లేదని బీజేపీ ఎంపీ అరవింద్ బాంబు పేల్చడంతో జనసేన గాలి తుస్సున దిగిపోయింది.  అరవింద్ వ్యాఖ్యానించినట్లే జాతీయాధ్యక్షుడు కూడా ప్రకటించారని వార్తలు వచ్చాయి.  పవనే మాతో పొత్తుకోసం వచ్చారు తప్ప పవన్ తో మాకు ఎలాంటి పొత్తు అవసరం లేదని వారు ప్రకటించాక కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పాదాలను వదలడంలేదంటే పవన్ కళ్యాణ్ ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.  పార్టీ స్థాపించిన అయిదేళ్ల వ్యవధిలో పవన్ కళ్యాణ్ పది ఊసరవెల్లుల పెట్టు అనిపించుకున్నారు.  అందుకే ఆ తమిళపత్రిక పవన్ కళ్యాణ్ కు అంత చక్కని టైటిల్ ఇచ్చి సత్కరించింది.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు