ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మూసీ వరదలపై స్పందించారు. వరద బాధితులకు అండగా నిలవాలని తెలంగాణలోని జనసేన పార్టీ నాయకులు, శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై, ముఖ్యంగా మూసీ నది వరద కారణంగా ఎంజీ బస్టాండ్ (MGBS) తో పాటు పరిసర ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న సూచనలను, వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన కోరారు.
వరదల వల్ల నష్టపోయిన బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహారం అందించే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, కార్యకర్తలను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో, శుక్రవారం సాయంత్రం నుంచి మూసీ నదిలో ఉధృతి పెరిగింది.
సుమారు 35 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో శుక్రవారం అర్ధరాత్రి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని కాలనీలు వరద నీటిలో చిక్కుకుపోగా, కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది.
మూసీ నదిపై ఉన్న పలు వంతెనలు సైతం నీట మునిగాయి. చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన, మూసారాంబాగ్ వంతెనలపై నుంచి కొన్ని అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో అధికారులు ముందుగానే ఈ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జి పక్కనే నిర్మాణంలో ఉన్న హై లెవల్ బ్రిడ్జిని కూడా వరద ముంచెత్తడంతో నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది.
మూసీ నదికి సమీపంలో ఉన్న ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) బస్టాండ్‌లోకి కూడా వరద నీరు చేరింది. ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహించింది. దీంతో బస్టాండ్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు భయాందోళన చెందగా, అధికారులు వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఈ పరిణామాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

