క్లారిటీ లేకుండా కర్ణాటకకు రానంటున్న పవన్!

మరో 20రోజుల్లో అసెంబ్లీ ఓటింగ్ కు వెళ్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటకలో ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుకుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కీలకమైన రేవంత్ రెడ్డి వంటి నేతలకు సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ ప్రచారం చేయించుకుంటుంటే… అదే ప్రయత్నంలో డీకే అరుణ వంటి వారితో బీజేపీ ప్లాన్ చేసుకుంది. ఇక కిచ్చా సుదీప్ వంటి స్టార్ హీరోలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. కీలక నియోజకవర్గాల్లో వారితో ప్రచారం చేయిస్తుంది. ఈ సమయంలో ఎంతమంది స్టార్స్ వచ్చినా… పవన్ వస్తే ఆ లెక్కే వేరని భావిస్తున్న బీజేపీ నేతలు ఆ దిశగా అడుగులు వేశారు.

కర్నాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ ఫిక్సయ్యింది. ఈ మేరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఇప్పటికే పవన్ తో రెండు సార్లు భేటీ అయ్యారు కూడా. తెలుగు వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ తో ప్రచారం చేయించాలని.. ఫలితంగా తెలుగువారి ఓట్లు కొల్లగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు.

అయితే ఈ విషయంలో పవన్ నుంచి మాత్రం ఇంకా సరైన స్పందన రాలేదని తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్స్ లో బిజీగా ఉన్న పవన్… వాటిని వీలైనంత తొందరగా పూర్తిచేసుకుని వారాహి వేసుకుని ఏపీకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఫిక్సయిన డేట్స్ మధ్య క్లాషెస్ తెచ్చుకుని కర్ణాటకలో బీజేపీ కోసం ప్రచారం చేయడం జరిగేపని కాదని అంటున్నారట.

అయితే అది అసలు కారణం కాదని.. ఏపీలో పొత్తు విషయంలో తమకు ఫుల్ క్లారిటీ ఇవ్వడంతోపాటు.. పవన్ పెట్టిన కండిషన్స్ కి కూడా ఒప్పుకుంటే.. కచ్చితంగా బీజేపీ కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు కానీ… పొత్తులపై క్లారిటీ లేకుండా ఎలాంటి వ్యూహాత్మక తప్పిదాలు చేయకూడదని జనసేన నేతలు భావిస్తున్నారని తెలుస్తుంది. అందుకోసమే బీజేపీ నేతలు ఎన్నిసార్లు అడిగినా కూడా… పవన్ సైలంట్ గానే ఉంటున్నారు తప్ప… బెంగళూరుకు ప్రయాణమవ్వడం లేదట.

మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ని ఎలాగైనా ఒప్పించి ప్రచారానికి బీజేపీ తీసుకుని వెళ్తుందా… లేక, లైట్ తీసుకుని ఏపీ పొత్తుల విషయంలో పరోక్షంగా క్లారిటీ ఇస్తుందా అన్నది వేచి చూడాలి!