అణ్వాయుధాలకు స్థానం లేదు..ఐరాస ఒప్పందానికి 50 దేశాల ఆమోదం

అధిపత్యపోరు అనే మాటను దాటి పెట్టి సెల్ఫ్ డిఫెన్స్ పేరుతో ప్రపంచం వ్యాప్తంగా పెద్ద దేశాలన్నీ
అణ్వాయుధాలను కుప్పలు తెప్పలుగా పోగేసుకున్నాయి. ఇంకా మూడవ ప్రపంచాల జాబితాలో ఉన్న భారత్ తో పాటు కనీసం తన ప్రజలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలను పోగు చేసుకుంది. లేని భయాలను కట్టి పెట్టి అణ్వాయుధాలను అరికట్టాలని ప్రపంచ దేశాలు దశాబ్దాలుగా విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ మేరకు అడుగులు పడడం శుభపరిణామం.

ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ( అణ్వాయుధాల నిషేధిత ఒప్పందం)నికి ఇప్పటి వరకు 50 దేశాలు ఆమోదం తెలిపినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. రానున్న మూడు నెలల్లోనే ఈ ఒప్పందం అమలులోకి రానుందని యూఎన్ఓ ప్రకటించింది.అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 50 దేశాలు అంగీకారం తెలపడం ఐక్యరాజ్యసమితి సాధించిన విజయాల్లో ఒక మైలురాయని యూఎన్ఓ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ప్రకటించారు.
సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అణ్వాయుధాల వల్ల మానవాళికి జరిగే అత్యంత విపత్కర దుష్పరిణామాలను అరికట్టడం తేలిక అవుతుందని చెప్పారు.

అయితే ఈ ట్రీటీ ఆన్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ఒప్పందం అమలు చేసేందుకు ఐరాసలో సభ్యత్వం ఉన్న కనీసం 50 సభ్యదేశాలు ఆమోదం తప్పనిసరి. తాజాగా హోండూరస్‌ అనే చిన్న దేశం కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడంతో అణ్వాయుధ నిషేధ ఒప్పందం అమలోకి రావడం తేలికైందని ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందంతో వచ్చే ఏడాది జనవరి 22 నుంచి అణ్వాయుధాల నిషేధం అమలులోకి రానుంది.

చిన్న చితక దేశాలు అణ్వాయుధాలు వద్దని వాదిస్తుంటే… అగ్రరాజ్యం అమెరికాతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు మొరాయిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్లు ఈ ఒప్పందాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులను ప్రయోగించిన తర్వాత జరిగిన విద్వంసాన్ని కళ్లారా చూసిన తర్వాత మానవాళికి మనుగడకు ప్రమాదకరంగా మారిన ఈ అణ్వాయుధాల జోలికి పోవద్దంటూ అంతర్జాతీయ పౌర సంఘాలు పోరాటం చేస్తున్నా పెద్ద దేశాలు ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగా ఐక్యరాజ్యసమితి ఏర్పడిన 75 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కానీ ఈ అణ్వాయుధ నిషేధం అమలులోకి రావడం లేదు.