బిగ్ బ్రేకింగ్: మహిళా రెజ్లర్ల ఇష్యూలోకి నక్సల్స్ ఎంటర్!

తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ ఉధృతం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీలు, క్రీడాకారులు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా మోడీ & కో స్పందించడం లేదన్న విషయం కాసేపు పక్కనపెడితే… తాజాగా సీన్ లోకి నక్సల్స్ ఎంటరయ్యారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయంశం అవుతోన్న తరుణంలో… మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ మద్దతు పలికారు. ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జనక్ పూర్ నుంచి ఛోటేబెథియా రహదారిపై బ్యానర్ ను ప్రదర్శించారు. బండే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పార్తాపూర్ ఏరియా కమిటీ ఈ బ్యానర్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా ఆ బ్యానర్లలో మరిన్ని విషయాలు వెళ్లడించిన నక్సల్స్… కేంద్రం ప్రవేశపెట్టిన “బేటీ బచావో బేటీ పఢావో” ప్రచారాన్ని కేవలం మోడీ ఆడుతున్న డ్రామాగా పేర్కొన్నారు. ఇలా రెజ్లర్ల పోరాటానికి నక్సల్స్ మద్దతు ఇవ్వడం ఛత్తీస్ గఢ్ లో కలకలం రేపుతుంది. ఈ సందర్భంగా పోలీసులు అప్రమత్తమవుతున్నారు.

మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోన్నట్లు తెలుస్తుంది. ఆయనపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్‌.ఐ.ఆర్‌.లో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏడుగురు మహిళా రెజర్లు అతడిపై ఫిర్యాదు చేశారు. ఆరుగురు రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక ఎఫ్‌.ఐ.ఆర్‌.. మరో మైనర్‌ రెజ్లర్‌ తరపున ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదైంది.

ఈ సందర్భంగా ఎఫ్‌.ఐ.ఆర్‌. లో కీలక విషయాలు వెళ్లడించారు మహిళా రెజ్లర్లు. తమను బ్రిజ్‌ భూషణ్ ఎలా వేధించింది ఆ అమ్మాయి సవివిరంగా వివరించారు. అత్యంత అనుచితంగా వ్యవహరించడం, బూతులు మాట్లాడటం వంటివి చేశారని.. అతడికి భయపడి ఒంటరిగా తిరగడం కూడా మానేసి గుంపుగానే వచ్చేవారనే విషయాన్ని ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పొందుపరిచారు. దీంతో ఈ వ్యవహారం బ్రిజ్ భూషణ్ తో పాటు బీజేపీ మెడకు చుట్టుకోబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.