ముందస్తు ముచ్చట లేదు.. మోడీని నమ్మొచ్చా?

గతకొన్ని రోజులుగా మోడీ పార్టీ పనులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీలో కీలకమైన కొంతమంది వ్యక్తులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతోపాటు.. రాష్ట్రస్థాయిలోని మరికొంతమంది నేతలను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం చేస్తున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణతో పాటు త్వరలో జరగబోయే ఐదురాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

ఈ సమయంలో ముందస్తు టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. అవును… ముందస్తుకు వెళ్తే లాభం ఏంటి, నష్టం ఏంటి విషయంలో బీజేపీలో తీవ్ర చర్చ నడుస్తుందని తెలుస్తుంది. అయితే ముందస్తుకు రావడం వల్ల ప్రతిపక్షాల ఐక్యతకు చెక్ పెట్టొచ్చనే ఆలోచనతో బీజేపీ అధిష్టాణం ఉందని అంటున్నారు. వారికి ఈ ఆలోచన రావడానికి తాజాగా వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు కారణం అని తెలుస్తుంది.

అవును.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ తిరోగమనంలో ఉందనే చర్చ మొదలైందని అంటున్నారు. ఇదే సమయంలో ఆ ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఐక్యతా రాగం అందుకున్నాయి. కాంగ్రెస్ కు పెద్దన్న స్థానం కట్టబెడుతూ… పలు పార్టీలు యాంటీ బీజేపీ స్టాండ్ ను గట్టిగా వినిపించాయి. దీంతో బీజేపీ అధిష్టాణం ఆలోచనలో పడిందని అంటున్నారు.

ఈ సమయంళో ప్రతిపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం అవసరం అని.. వారికి ఎక్కువ సమయం ఇవ్వకుండా ముందస్తు ముచ్చట చేయొచ్చని అంటున్నారంట. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ… బడ్జెట్ లో పొందుపరచిన అంశాలన్నీ వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడాలని మంత్రులకు సూచించారు. అమలైన పథకాల గురించి, జరిగిన మంచి గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. దీంతో… మోడీకి ముందస్తు ఆలోచన ఉన్నట్లుందనే చర్చ మొదలైంది.

అయితే… తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముందస్తు ముచ్చట లేదు అనే సంకేతాలు మాత్రం మంత్రుల ద్వారా మీడియాకు వదిలారు మోడి. దీంతో… పైకి ఒకటి చెబుతూ వెనక వేరే ఆలోచన చేస్తున్నారా.. లేక, ముందస్తుకు వెళ్లే ఆలోచన నిజంగానే మోడీకి లేదా అనే చర్చ మొదలైంది.