ప్రిస్టేజ్ ఇష్యూ… నాగబాబు అంతకు తెగిస్తారా?

జనసేన నేత నాగబాబుకు సంబంధించిన ఒక ఆసక్తికర చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఒకప్పుడు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సమయంలో పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనిపించిన నాగబాబు… ఇటీవల తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి నాగబాబుకు 2019లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో నాగబాబు మూడోస్థానానికే పరిమితమైనప్పటికీ రెండున్నార లక్షల ఓట్లు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే… ఇప్పుడు జనసేన… బీజేపీ, టీడీపీలతో కలిసి వేళ్తుంది. దీంతో పోటీచేసే స్థానాలు చాలా పరిమితంగా మారిపోయాయి.

ఇందులో భాగంగా.. మొదట్లో 60 – 70 నుంచి తర్వాత కాలంలో 40 – 50 కి అక్కడ నుంచి 30 – 40 కి అంటూ చర్చలు జరిగిన 24 దగ్గర ఆగగా… తాజాగా ఆ నెంబర్ 21కి చేరింది. ఇక లోక్ సభ స్థానాల విషయంలో 9, 6, 3 నుంచి ఇప్పుడు 2 దగ్గరకు వచ్చి చేరిన పరిస్థితి. ఈ సమయంలో సీట్ల కోత కాస్తా నాగబాబు సీటు కోతకు దారితీసింది.

నాగబాబుని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారనే కథనాలు నిన్నమొన్నటివరకూ బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. అందువల్లే నాగబాబు అచ్యుతాపురంలో మకాం పెట్టారని చెబుతారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఇటీవల ఆ ఇంటిని ఖాళీ చేసేసి తిరిగి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారని తెలుస్తుంది. అందుకు కారణం… అనకాపల్లి సీటు కూడా నరసాపురం తరహాలోనే చేజారిపోయింది.

దీంతో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్దామనుకున్న నాగబాబు ఆశలు అడియాశలైపోయాయి. నరసాపురం దక్కలేదు.. అనకాపల్లి చేజారింది. దీంతో నాగబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది. ఇదే అదనుగా… సొంత అన్నకు కూడా టిక్కెట్ ఇప్పించుకోలేని దయణీయమైన పరిస్థితుల్లో పవన్ ఉన్నాడు అంటూ ప్రత్యర్థులు సెటైర్లు వెయడం మొదలుపెట్టారు. తన పార్టీలో తనకైనా టిక్కెట్ ఉంటుందో లేదో అనే కామెంట్లూ మొదలైపోయాయి.

ఈ సమయంలో నాగబాబుకు నరసాపురం ఎంపీ టిక్కెట్ దక్కాలంటే ఆయనకు ఒకే ఒక్క ఆప్షన్ ఉందని అంటున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానం బీజేపీ ఖాతాలో పడిందని చెబుతున్నారు. ఆ స్థానం కోసం మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణికి ఇవ్వాలని బీజేపీ భావించినప్పటికీ.. అందుకు ఆమె సుముఖంగా లేరని చెబుతున్నారు. దీంతో ఆ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుంది.

ఇటీవల రఘురామ కృష్ణంరాజుని అమిత్ షా… తన ఇంటి బయటే ఆపేయడంతో ఆయనకు నరసాపురం టిక్కెట్ దక్కే అవకాశాలు సన్నగిల్లాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో… పవన్ కల్యాణ్ అన్న నాగబాబు బీజేపీలో చేరితే నరసాపురం టిక్కెట్ ఆయనకు దక్కే అవకాశం ఉందని.. అంతకు మించి ఇప్పుడు నాగబాబుకు అవకాశం లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది.

జనసేనకు కేటాయించబడిన రెండు లోక్ సభ స్థానాల్లోనూ మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి పోటీ చేస్తుండగా… కాకినాడ నుంచి సానా సతీష్ కానీ.. పవన్ కల్యాణ్ కానీ పోటీ చేయొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో… నాగబాబు బీజేపీ కండువా కప్పుకుంటే వెంటనే ఆయనకు నరసాపురం ఎంపీ టిక్కెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

మరి వస్తున్న ఊహాగాణాలు, జరుగుతున్న చర్చలకు తగ్గట్లుగానే నాగబాబు బీజేపీలో చేరతారా..? లేక, జనసేన రాజకీయాలు పూర్తిగా తమ్ముడికే వదిలేసి సైలంట్ అయిపోయి ట్విట్టర్ కే పరిమితమైపోతారా అన్నది వేచి చూడాలి!!