‘రాజకీయం అంటే ఒక రొచ్చు.. ఒక బురద.. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది..’ అంటూ మిత్రుడు రజనీకాంత్ పేరు ప్రస్తావిస్తూ ఓ లేఖ విడుదల చేశారు సినీ నటుడు మోహన్‌బాబు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, రాజకీయాలపై ఇటీవల షాకింగ్ డెసిషన్ తీసుకున్న విషయం విదితమే. ఈ నిర్ణయం వెనుక, టాలీవుడ్ నటులు చిరంజీవి, మోహన్‌బాబు వున్నారంటూ కొన్ని పుకార్లు బయల్దేరాయి. ఈ క్రమంలో మోహన్‌బాబు, రజనీకాంత్ విషయమై ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు. అందులో రజనీకాంత్‌తో తనకున్న ఆత్మీయత గురింఇ చెప్పుకున్నారు. స్నేహితుడి ఆరోగ్యం గురించిన తెలిసిన వ్యక్తిగా.. అని పేర్కొంటూ, రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్నారు. ‘నీలాగే, నేనూ ముక్కుసూటి మనిషిని..’ అంటూ తన గురించీ గొప్పగా చెప్పుకున్నారు మోహన్‌బాబు.
కానీ, మోహన్‌బాబు గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. కొన్నాళ్ళ క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ గెలుపు కోసం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు కూడా. మోహన్‌బాబుకి వైఎస్ జగన్ హయాంలో రాజ్యసభ సీటు దక్కుతుందని అంతా అనుకున్నారు. లేదంటే ఏదన్నా నామినేటెడ్ పోస్టు అయినా జగన్, మోహన్‌బాబుకి ఇస్తారనే ప్రచారం జరిగింది. టీటీడీ ఛైర్మన్‌గిరీ మోహన్‌బాబుకి దక్కుతుందనీ పుకార్లు షికార్లు చేశాయి. కానీ, అవేవీ జరగలేదు. ‘ఎవరికీ ద్రోహం చెయ్యం.. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదు..’ అంటూ మోహన్‌బాబు, తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇవన్నీ మోహన్‌బాబు ఎవర్ని ఉద్దేశించి చెబుతున్నట్లు.? చంద్రబాబు తనను వెన్నుపోటు పొడిచినట్లు మోహన్‌బాబు గతంలోనే చెప్పారు. మరి, వైఎస్ జగన్ హయాంలో ఏం జరుగుతోంది.? మోహన్‌బాబు, తాజా వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి. కేవలం రజనీకాంత్ వరకు మాత్రమే పరిమితం చేస్తూ, స్నేహితుడ్ని రాజకీయాల విషయమై వారిస్తున్నట్లుగా మాత్రమే ఈ లేఖని చూడాలా.? అంటే మరి.. అంతకన్నా పెడార్థాలు తీయడం సబబు కాదేమో.! ఏది ఏమైనా, రాజకీయం అంటే రొచ్చు కాదు. రాజకీయాల్లో ‘రొచ్చుగాళ్ళు’ వున్నారంతే. ఎవరైనా మాట్లాడాల్సింది ఇదే. పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు, మంచి ఆలోచనలతో వున్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే, ఆ రొచ్చుగాళ్ళను బయటకు పంపేయొచ్చు. అంతే తప్ప, రాజకీయాల్ని రొచ్చుగా భావిస్తే, వ్యవస్థ ఎలా బాగుపడుతుంది.?