ఢిల్లీ వేదికగా రైతు సంఘాలు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ. నిన్ననే భారత్ బంద్ కూడా చేపట్టడం చూశాం. ‘భారత్ బంద్‘ దెబ్బకి కేంద్రం దిగొచ్చింది. కొత్త చట్టాలకు కొన్ని సవరణలూ ప్రతిపాదించింది. అయితే, ఆ సవరణలు సరిపోవనీ, మొత్తంగా ఆ మూడు చట్టాల్నీ రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. ఇప్పుడెలా.? ప్రధాని నరేంద్ర మోడీ ఏ అస్త్రాన్ని రైతుల మీద ప్రయోగించబోతున్నారు.? ఇప్పుడు ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తాము తీసుకొచ్చిన చట్టాల్ని వెనక్కి తీసుకునేందుకు ఇష్టపడదు. కొన్ని సవరణలు మాత్రమే చేస్తుంటుంది.
రైతులతో అంత ఈజీ కాదు మోడీజీ.!
రైతుల ఆవేదన దేశానికి అర్థమవుతోంది. 130 కోట్లమంది భారతీయులు, రైతులకు బాసటగా నిలుస్తున్నారు. ఎందుకంటే, మనది వ్యవసాయ ఆధారిత దేశం గనుక. అయినాగానీ, చాలామందికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన లేదు. అదే సమయంలో, రైతులు కంటతడి పెడుతోంటే, చలించని భారతీయుడు వుండడు. ఏదో ఊరికే, రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తారని ఎవరైనా అనుకోగలరా.? రైతుల్ని రెచ్చగొడుతున్నారంటూ బీజేపీ వాదులు చెప్పొచ్చుగాక. కానీ, రైతులే వద్దంటున్న కొత్త చట్టాల్ని బలవంతంగా ఆ రైతుల మీద రుద్దడమేంటి.?
మోడీ చేతిలో వున్న అస్త్రం అదేనట
ఇప్పుడు రైతుల ఉద్యమంలో చీలిక తీసుకురావడమొక్కటే నరేంద్ర మోడీ ముందున్న ఆప్షన్. ఇప్పటికే మోడీ ప్రభుత్వం, కొత్త చట్టాలకు సవరణల్ని ప్రతిపాదిస్తూ, ఆ వివరాల్ని రైతు సంఘాల ముందుంచింది. అయితే, వాటిని రైతులు ససేమిరా అంటున్నారు. అదే సమయంలో కొందరు రైతులు మాత్రం, కాస్త ఆలోచనలో పడ్డారట. ఈ విషయమై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్న కేంద్రం, ఇంకొన్ని ప్రతిపాదనల్ని కూడా జత చేయాలనుకుంటోందని సమాచారం.
రైతులెవరూ మోడీ ట్రాప్‌లో పడబోరంటోన్న రైతు సంఘాలు
ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని నెలలైనా ఆందోళనలు కొనసాగిస్తామనీ, కొత్త వ్యవసాయ చట్టాల రద్దు తమ లక్ష్యమనీ రైతు సంఘాలు తెగేసి చెబుతున్నాయి. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణని కూడా ప్రకటించాయి. బీజేపీ నేతలను ఘెరావ్ చేసే కార్యక్రమాలు కూడా ఇందులో వున్నాయి. అంటే, అధికార బీజేపీపై ముందు ముందు పూర్తిస్థాయి ఒత్తిడి పెట్టనున్నారన్నమాట రైతులు. అదే జరిగితే, మోడీ సర్కార్‌కి కష్ట కాలమే. కానీ, ఈ తరహా ఉద్యమాల్ని ఎలా అణచివేయాలో పాలకులకు బాగా తెలుసు. ఆ పరిస్థితి రాకూడదనే ఆశిద్దాం.