ఎమ్మెల్యే టిక్కెట్ కి అప్లికేషన్ ఫీజు… ఎవరికి ఎంతంటే?

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు హాజరయ్యేవారు డీడీ రూపంలోనూ, ఆన్ లైన్ పేమెంట్ రూపంలోనూ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఫీజులో రిజర్వేషన్స్ వారీగా మార్పులు ఉంటాయి. అయితే తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం చేసుకునే ధరఖాస్తుకు కూడా ఫీజు వచ్చింది. అందులో కూడా రిజర్వేషన్స్ వారీగా ధరలు నిర్ణయించబడ్డాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ… తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావడం తథ్యం అనే నమ్మకంతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాజకీయంగా కొత్త అడుగులువేస్తూ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా చెల్లించాల్సిందనే నిర్ణయం పెట్టింది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇందులో భాగంగా… సెప్టెంబరు నెలలోనే అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించాలని భావిస్తోందని తెలుస్తోంది. దీనికోసం నేటి నుంచే ధరఖాస్తులు స్వీకరించనుంది.

ఎన్నికలకు వీలైనంత ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వలన ఇంకాస్త ప్రయోజనం ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా.. ప్రచారంలో దూసుకువెళ్లేందుకు అవకాశం ఉండటంతో పాటు, నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించడానికీ సమయం ఉంటుందని భావిస్తోన్నారట. ఈ నేపథ్యంలో… ఆగస్టు 15 నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ దరఖాస్తు కోసం ఫీజు కూడా నిర్ణయించారు. ఎమ్మెల్యే టికెట్ కోరే వ్యక్తి ఓసీ అయితే 10,000.. బీసీలు 5,000.. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 2,500 రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ ఫీజులే ఫైనల్ కాదనే మాటలూ వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ తుది ఫీజులను నిర్ణయిస్తుందని అంటున్నారు.

వీటి ప్రకారం… ఓసీ అభ్యర్థులు 50,000.. బీసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 25,000 రూపాయల వంతున రుసుములు నిర్ణయించాలని భావిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇది కొత్త ట్రెండ్ అనే అనుకోవాలి!