ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రిజిస్ట్రేషన్లపై గందరగోళం వద్దు: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు మొత్తం పూర్తి చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.
మొత్తం కేటాయించాల్సిన ప్లాట్లు ల్యాండ్ పూలింగ్ కింద 30,635 మంది రైతులకు సంబంధించి 34,911.23 ఎకరాలకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు కేటాయింపు పూర్తయింది 29,644 మంది రైతులకు చెందిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కేటాయింపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2727 మంది రైతులకు సంబంధించి 3188 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. పెండింగ్లో ఉన్న కేటాయింపు ఇంకా 991 మంది రైతులకు సంబంధించిన 719 ఎకరాలకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది.

2501 మంది రైతులకు చెందిన 8441 ప్లాట్లు వివిధ కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. అమరావతిలో రైతులతో మాట్లాడి ఈ పెండింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సాంకేతిక సమస్యల కారణంగా 484 మంది రైతులకు సంబంధించి ₹ 3.15 కోట్ల కౌలు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. చివరగా, రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళానికి గురిచేయవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి మంత్రి నారాయణ సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

