ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. టెక్ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చినట్లు కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, టెక్ ప్రపంచంలో ఏపీకి ఇది ఒక చారిత్రక రోజని అభివర్ణించారు. “డేటా సెంటర్లు దేశానికి కొత్త రిఫైనరీల వంటివి” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ రాకతో ఏపీ గ్లోబల్ టెక్ మ్యాప్‌పై తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందని, డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి సేవలకు గూగుల్ మరింత సహకారం అందించాలని కోరారు.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, గూగుల్ నిర్ణయం దేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకువస్తుందన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు దేశ ప్రగతికి కీలకమని వివరించారు. కేంద్రం తీసుకొచ్చిన డేటా సెంటర్ పాలసీ వల్లే ఇలాంటివి సాధ్యమవుతున్నాయని తెలిపారు.
గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ: ఈ డేటా సెంటర్‌తో పాటు సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ నగరం దక్షిణాసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో అనుసంధానమవుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మయన్మార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు కూడా కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు గూగుల్ సహకరించాలని ఆయన కోరారు. ఏఐ వల్ల ఉద్యోగాలపై నెలకొన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా టెక్ నిపుణులకు మరిన్ని అవకాశాలు వస్తాయని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, 2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగుగా నిలుస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు.




